calender_icon.png 10 February, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీపై పోరాటానికి సిద్ధం కావాలి!

10-02-2025 01:29:46 AM

‘మాతృభూమి’ దినపత్రిక ఎడిటర్ మనోజ్ కె.దాస్‌తో ఇంటర్వ్యూలో సీఎం రేవంత్‌రెడ్డి

* నదీజలాలతో పాటు రాజకీయ, భౌగోళికపరమైన అంశాల్లో తేడాలపై దక్షిణాది రాష్ట్రాలు ఏవిధమైన వ్యూహం అవలంబించాలి..? ఏవిధంగా కలిసి సాగాలి..?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ వాళ్లు ప్రతీ దానిని వాళ్ల నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు. ఈనేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పుదుచ్చేరి ప్రజలు ఏకమవ్వాలి. ఈవిషయంలో రాజకీయ పార్టీల నేతలను ప్రశ్నిస్తే వారు తమ రాజకీయ లెక్కలను సరిచూసేందుకు ఈ వేదికను వినియో గించుకుంటారు. అందుకే దక్షిణాది ప్రజలు పోరాడేందుకు ఏకం కావాలి. తప్పనిసరైతే ఈ విషయంలో నేను చొరవ తీసుకుంటా. 

* బీజేపీ విషయంలో విపక్ష పార్టీలకు ఒకే అభిప్రాయం ఉన్నా.. కలిసి సాగలేకపోతున్నారు..? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి..? 

అందుకే మేం ఇండియా కూటమి ఏర్పాటు చేశాం. అయితే ప్రతి ఒక్కరూ అన్నింటిని కోరుకుంటున్నారు. అదే సమస్య.  ఢిల్లీ, హర్యానాలను చూస్తే అర్థ్ధమవుతుంది. హర్యానాలో కేజ్రీవాల్ కాంగ్రెస్‌ను దెబ్బతీశారు.. ఢిల్లీలో అది ఆయనకు ప్రతికూలమైం ది. అంతిమంగా బీజేపీ లాభపడింది.. ఈ విషయంలో మనం ఆలోచించాలి.

ఒకే దేశం ఒకే ఎన్నిక, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి మనమంతా ఏకమవ్వడానికి ఇది సరైన సమయం. భారత ప్రభుత్వ విధానాల ఆధారంగానే మనం కుటుంబ నియంత్రణ పాటించాం. జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు  అదంగా నియోజకవర్గాలు రాకపోగా ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను కోల్పోతాం.

అం దుకే  నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఆయా రాష్ట్రాల్లో ఉన్న సీట్లకు అదనంగా 50 శాతం సీట్లు పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచించా. అలా చేస్తే ఉదాహరణకు కేరళలో ప్రస్తుతం 20 సీట్లు ఉన్నాయి.  సీట్లు పెంచితే అదనంగా 10 సీ ట్లు వస్తాయి.  తెలంగాణకు 17 సీట్లు ఉన్నా యి.

అదనంగా 9 వస్తాయి. అలా చేయకుం డా జనాభా దామాషా ప్రకారమే  నియోజకవర్గాల పునర్విభజన చేపడితే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రా ల్లో గెలిచే సీట్లతో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పా టు చేయొచ్చు. దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పనిలేదు. 

* మహారాష్ర్టకు రెండున్నరేళ్ల పాటు జీఎస్టీ తిరిగి చెల్లించలేదు. మధ్యప్రదేశ్‌కు మొత్తం ఇచ్చారు.. ఒకే దేశం ఎన్నిక విషయంలో రాష్ట్రాలను విస్మరిస్తున్నారు..?

ఒకే దేశం ఎన్నికను మేం అంగీకరించం. అది ఏవిధంగానూ సరైంది కాదు.  జాతీయ స్థాయి ఎన్నికలు,  రాష్ట్రాల ఎన్నికలు వేర్వేరు. తప్పనిసరైతే ఒకే రాష్ర్టం, ఒకే ఎన్నికలు చేపట్టవచ్చు ఎందుకంటే గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు,  జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, సహకార ఎన్నికలు ఒకేసారి చేపట్టవచ్చు. వాటిల్లో మనం అనేక రాజకీయ వాగ్దానాలు చేస్తాం.

జాతీయ స్థా యి ఎన్నికలు,  రాష్ట్రాల ఎన్నికలు వేర్వేరు. రాష్ర్టం ఒక యూనిట్..  ఈ దేశం రాష్ట్రాల సమాఖ్య. నదుల అనుసంధానంలో వారిది అదే విధానం.. క్రమంగా ఒకదాని వెంట రాష్ట్రాల అధికారాలను లాక్కుంటున్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలు దీనిని పూర్తిగా అర్థం చేసుకోవడం లేదు. మేధావులు దీనిపై ఆలోచన చేయాలి.. ఈ విషయంలో ప్రజలు బాధ్యతయుతంగా ఉండాలనేది నా భావన. 

* కేరళ అప్పులతో మునిగిపోయింది. కేరళకు మీరిచ్చే సలహా ఏమిటి..? 

సీఎం రేవంత్‌రెడ్డి: అభివృద్ధి.. సంక్షేమం రెండు సమాంతరంగా సాగాలి.  మా ప్రభు త్వం అభివృద్ధితో పాటు సంక్షేమంపై దృష్టిసారించింది. కేరళ ప్రభుత్వం కేవలం సంక్షే మం, దానిలోని అవినీతిపై దృష్టిసారిస్తోందే తప్ప అభివృద్ధి, పెట్టుబడులపై దృష్టి సారించడం లేదు. కేరళ ప్రభుత్వం తన  విధానా లను పునఃసమీక్షించుకోవాలి. ఇదే అవకాశంగా  కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను తన ని యంత్రణలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. 

* మీప్రాంతానికే చెందిన పీవీ నరసింహారావు సమర్థుడైన ప్రధానమంత్రి. కానీ, ఆయనకు కాంగ్రెస్ సరైన గౌరవం ఇవ్వలేదు.. ?

అది బీజేపీ,  నరేంద్రమోదీ  వాట్సాప్ యూనివర్సిటీ  సృష్టించిన ఒక భావన. పీవీ నరసింహరావు  సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు ఎదిగారంటే కాంగ్రెస్ వల్లే. ఏఐసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వల్లభాయ్ పటేల్, పీవీ నరసింహరావులను కాంగ్రెస్ వ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారు. వల్లభాయ్ పటేల్ ఏఐసీసీ అధ్యక్షుడిగా, కేంద్ర హోం శాఖ మంత్రిగా పనిచేశారు.

ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్ ముద్ర వేస్తున్నారు. తాము వల్లభా య్ పటేల్ వారసులమని బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారు. పీవీ కుటుంబం తో నాకు మంచి సంబంధాలున్నాయి. మన కు అనేక మంది నాయకులున్నారు.  నీలం సంజీవరెడ్డి రాష్ర్టపతి అయ్యారు. జైపాల్‌రెడ్డి కేంద్రమంత్రిగా పనిచేశారు.  దక్షిణాది రా ష్ట్రాల వారికి కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు ఇచ్చింది. 

* ఢిల్లీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్..?

ఆ ఎన్నిక పూర్తిగా ఒక జాతీయ పార్టీ. ఒక ప్రాంతీయ పార్టీ మధ్య కేంద్రీకృతమైంది. ఈ మధ్యకాలంలో ప్రజలు ప్రతిపక్షం కన్నా అధికార పక్షం వైపే మొగ్గుచూపుతున్నారు. మూడో పార్టీకి అవకాశం ఇవ్వడం లేదు. కొత్తగా వచ్చిన ఈ మార్పును మనం గమనించాలి. వాళ్ల తీర్పును అర్థం చేసుకోవాలి.

* మీ నాయకత్వ రహస్యాలను శశిథరూర్, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులతో పంచుకుంటారా..?  

అది వంద శాతం నిజమనుకోను.. క్యాడర్ అన్నింటికీ తెగించి పోరాడింది.. నేను వారిని సోనియాగాంధీ పేరుతో ప్రేరేపించాను అంతే. అరవై ఏళ్ల పోరాటం తర్వాత సోనియాగాంధీ వల్ల తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ కార్యకర్తగా సోనియాగాంధీ పేరుతో నేను ఓట్లు అభ్యర్థించా.. జాతీయ నాయకులను రంగంలో ఉంచితేనే  అంత పెద్ద మొత్తంలో ఓట్ల శాతం సాధించగలం.

బీజేపీని చూడండి.. సర్పంచ్ ఎన్నికలు వస్తే  నరేంద్రమోడీని  సర్పంచ్ అభ్యర్థిగా చూపెడుతుంది. కాంగ్రెస్ క్యాడర్ లోకల్ లీడర్ పేరుతో ఓట్లు అడుగుతారు. స్థానిక నాయకులు గట్టిగా పనిచేసి జాతీయ నాయకత్వం పేరుతో ఓట్లు అడగాలి. అప్పుడే ప్రజలు ఓట్లు వేస్తారు.