calender_icon.png 26 March, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి నియంత్రణపై నిఘా ఉంచాలి: సీపీ

25-03-2025 05:33:56 PM

చట్టబద్దంగా పని చేసినప్పుడు గుర్తింపు వస్తుంది..

మంచిర్యాల (విజయక్రాంతి): గంజాయి నియంత్రణపై పటిష్ఠమైన నిఘా ఉంచాలని, నియంత్రణకు కృషి చేయాలని సీపీ అంబర్ కిషోర్ ఝా(CP Amber Kishore Jha) అన్నారు. మంగళవారం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారి సమీక్షలో సీపీ మాట్లాడారు. ప్రతి ఒక్క పోలీస్ అధికారి చట్టబద్ధంగా పనిచేయాలని, మంచిగా పని చేసినప్పుడు తప్పుక గుర్తింపు వస్తుందన్నారు. ప్రతి కేసులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని, ఎస్సీ, ఎస్టీ కేసులలో న్యాయపరంగా, పారదర్శకంగా విచారణ జరపాలని, ప్రతి పోలీస్ స్టేషన్ లో అధికారులకు, సిబ్బందికి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని రకాల సమాచారంపై అవగాహన ఉండాలని, విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు.

సీసీ కెమెరాలు జరిగే విషయాలను గుర్తించడం జరుగుతుందని, ప్రజలతో మంచి సత్ససంబంధాలను కొనసాగిస్తే బయట చర్చ జరిగే ప్రతి ముందస్తు సమాచారం తెలుస్తుందన్నారు. దొంగతనాలు జరుగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, పెట్రోలింగ్‌ ముమ్మరం చేయాలని, ప్రధాన చోరీలకు పాల్పడిన నేరస్థులను గుర్తించడంతో పాటు చోరీ సోత్తును స్వాధీనం చేసుకోవాలని సూచించారు.

విలేజ్ సేప్టీ కమిటీలను ఏర్పాటు చేయాలి..

రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో విలేజ్ సేఫ్టీ కమిటీ(Village Safety Committee)లను ఏర్పాటు చేయాలని సీపీ అంబర్ కిషోర్ ఝా కోరారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులకు, బాధితులకు ప్రతి రోజు రెండు గంటల పాటు కేటాయించాలన్నారు. మరో రెండు గంటలు పెండింగ్‌ కేసులపై సమీక్ష జరపాలని, ఏదైనా సంఘటన జరిగినప్పుడు, బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు సంఘటన స్థలానికి తప్పనిసరిగా వెళ్ళాలని, అప్పుడు క్షేత్రస్థాయిలో సమాచారం లభిస్తుందన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించినట్లయితే శాఖ పరమైన చర్యలు తప్పవన్నారు. 

పోలీస్‌ స్టేషన్‌, డివిజినల్‌, జోన్ ల వారిగా పెండింగ్ కేసులకు సంబంధించి నేరస్థుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్‌షీట్‌కు సంబంధించి కేసుల స్థితిగతులపై పోలీస్‌ లను సీపీ అడిగి తెలుసుకున్నారు. గ్రేవ్‌ కేసులు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, పోక్సో కేసులు, మిస్సింగ్‌, గంజాయి, రోడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించి సమాచారంతో పాటు, కేసుల పరిష్కారం కోసం ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో పోలీస్‌ స్టేషన్‌ ల వారిగా అధికారులతో సమీక్షా జరిపారు.

అనంతరం గంజాయి స్వాధీనం కేసులలో ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి సీపీ చేతుల మీదుగా రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్ డిసిపి (అడ్మిన్) సీ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, పెద్దపెల్లి ఏసీపీ జి కృష్ణ, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏసీపీ మల్లారెడ్డి, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్, సీఐ లు, వివిధ వింగ్ ల సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.