calender_icon.png 16 March, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినియోగదారుల హక్కుల పరిరక్షణకు పాటుపడాలి

15-03-2025 10:24:32 PM

అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్..

నిజామాబాద్ (విజయక్రాంతి): వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం సంబంధిత శాఖల అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పౌర సరఫరాల శాఖ, సివిల్ సప్లైస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వినియోగదారుల హక్కులు, బాధ్యతలను తెలియజేస్తూ, చట్ట పరిధిలో ఎలాంటి సేవలు పొందవచ్చు, వస్తు, సేవలలో మోసాలు ఎదురైనప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి తదితర అంశాలపై వినియోగదారులను చైతన్యపర్చే కార్యక్రమాలు నిర్వహించాలని వినియోగదారుల సంఘాలకు సూచించారు.

వస్తువుల నాణ్యత, వాటి ప్రమాణాల గుర్తింపు తదితర అంశాలపై వినియోగదారులకు అవగాహన ఉన్నప్పుడే, నాసిరకం, నాణ్యతా లోపాలను గుర్తించి తమ హక్కుల కోసం ఫిర్యాధు చేయగల్గుతారని అన్నారు. వినియోగదారుడు తన హక్కులు, బాధ్యతలను తెలుసుకున్నప్పుడే నాణ్యమైన వస్తువులు, సంతృప్తికర సేవలు పొందేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఒకవేళ ఏదైనా సందర్భంలో మోసాలకు గురైతే న్యాయం పొందేందుకు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాలు దోహదపడతాయని అన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు వినియోగదారులకు వారి హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన పెంపొందించేందుకు కృషి చేయాలని హితవు పలికారు. నేటి రోజుల్లో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నాణ్యమైన వస్తువులు, సేవలను గుర్తించేందుకు గల అవకాశాలను తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.