22-04-2025 10:11:00 PM
జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు -పిల్లి సుధాకర్
చర్ల (విజయక్రాంతి): అంబేద్కరిజంపై జరిగే దాడిని ఐక్యంగా ఎదుర్కొంటూ భారత రాజ్యాంగ రక్షణే లక్ష్యంగా అంబేద్కర్ వాదాన్ని కాపాడుకోవాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్నారు. చర్ల మండలం లింగాపురం గ్రామంలోని కొంగూరు సత్యనారాయణ స్వగృహంలో మంగళవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ వాదాన్ని విచ్చిన్నం చేయడానికి మనువాద శక్తులు ప్రయత్నిస్తున్నాయని, దీనిని జాతీయ మాల మహానాడు కార్యకర్తలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో ప్రాథమిక హక్కులకు తూట్లు పొడిచి అస్థిరతకు బాటలు వేస్తున్నారని, రాజ్యాంగంలోనే మన హక్కుల పేజీని ఒక్కొక్కటిగా చింపేస్తున్నారని ఆరోపించారు.
యువత అంబేద్కర్ వాదాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు జాతీయ కార్యదర్శి, జిల్లా ఇన్ ఛార్జ్ అసొద భాస్కర్, జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఏడెల్లి గణపతి, పల్లంటి రమేష్, బోళ్ల వినోద్, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు బోడ దివ్య, కార్యదర్శి మద్దేటి జయ, చర్ల మండల అధ్యక్షులు తోటమల్ల గోపాలరావు, ఇల్లందు నియోజకవర్గ సీనియర్ నాయకులు కాలే పుల్లయ్య, కొత్తగూడెం నియోజకవర్గ సీనియర్ నాయకులు గుడివాడ రాము, దాసరి అశోక్, కొత్తగూడెం మాజీ ఎంపీటీసీ కెండెం రాము,భద్రాచలం నియోజకవర్గ సీనియర్ నాయకులు కారంపూడి సాల్మన్, తోటమల్ల విజయరావు తదితరులు పాల్గొన్నారు.