20-04-2025 12:41:38 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టాలి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి) : రాజ్యాధికార సాధన కోసం యాదవులంతా ఐక్యంగా ఉద్యమించి సాధించుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణ య్య పిలుపునిచ్చారు. యాదవుల్లో ఉన్న శక్తి, యుక్తులను వెలుగులోకి తీసురావాలని ఐక్యంగా ఉండాలని నూచించారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సమావేశం సమితి జాతీయ అధ్యక్షుడు, యాదవ యుద్ధనౌక అవార్డు గ్రహీత మేకల రాములు యాదవ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాజకీయంగా ఎదగాలంటే తమ కులస్తులకు మాత్రమే ఓట్లు వేయాలని, పార్టీలను చూసి ఓట్లు వేయరాదన్నారు.
తద్వారా విద్యా, ఉద్యోగ, ఆర్ధిక తదితర రంగాలలో అభివృద్ధి సాధించుకోగలుగుతారని చెప్పారు. స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, మంత్రి వర్గంలో ఒకరికి అవకాశం కల్పించాలని, చట్ట సభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన పలు తీర్మానాలు తెలంగాణ రాష్ట్రంలో 16 శాతం ఉన్న యాదవులకు యాదవ కార్పోరేషన్ కు ఛైర్మన్, డైరెక్టర్లను నియమించి, రూ.5 వేల కోట్లు నిధులు కేటాయించాలన్నారు.
అలాగే గోర్ల, మేకల రాష్ట్ర ఫెడరేషన్ కు ఛైర్మన్, డైరెక్టర్లను నియమించాలన్నారు. రాష్ట్ర క్యాబినేట్లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని, ముగ్గురిని ఎమ్మెల్సీలుగా నియమించాలన్నారు. కోకాపేట లోని యాదవ భవన్ ను వెంటనే ప్రారం భించాలని, జీవో నెం.559, 1016 ప్రకారం 5 నుంచి 10 ఎకరాల బంజారు భూమిని కేటాయించాలన్నారు. రాబోయే 2028-29 ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు 15 అసెం బ్లీ సీట్లు, 3 ఎంపీ స్థానాలను కేటాయించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన యాదవులకు అన్ని రాజకీయ పార్టీలు తగినన్ని సీట్లు కేటాయించాలన్నారు.
వీటిని యాదవులు ఏకగ్రీవంగా అమోదించారు. సమితి రాష్ట్ర అధ్యక్షులుగా దేవేందర్, మహిళా అధ్యక్షురాలుగా గంగుల అంజలి యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా జనార్దన్ గౌడ్, నందగోపాల్, రాందేవ్ మోడీ, వివిధ యాదవ సంఘాల నేతలు గడ్డం శ్రీనివాస్ యాదవ్, గుడిగె శ్రీనివాస యాదవ్, చిలుకల వట్టి జానకయ్య, రాజారాం యాదవ్, తదితరులు పాల్గొన్నారు.