20-04-2025 10:49:09 PM
సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారధి..
మహబూబాబాద్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రత్యక్ష పోరుకు ప్రజలు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి పిలుపునిచ్చారు. గ్యాస్ ధర, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచడానికి ప్రజలంతా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల నుండి నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి కార్పొరేటు సంస్థలకు దాసోహం అన్న తీరుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా రూపొందించిన వక్ఫ్ సవరణ చట్టం బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ కార్యాలయం నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ అనంతరం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.