17-03-2025 02:18:26 AM
పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి (విజయ క్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్థానిక జిల్లా బిజెపి పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా అధ్యక్షుడు పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గడపగడపకు అందేలా చూడాలని కార్యకర్తలకు సూచించారు.
కార్యకర్తలే పార్టీకి బలమని, ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి వచ్చే స్థానిక సంస్థల్లో బిజెపి విజయ దుందుభి మొ గించేలా చూడాలని పిలుపునిచ్చారు. కొమురం భీం జిల్లాలో వనరులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అందరి సమన్వయంతో ముందుకు సాగాలని పార్టీ జిల్లా అధ్యక్షునికి సూచించారు.
సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ నూతనంగా పదవి స్వీకారం చేసిన జిల్లా అధ్యక్షుడిపై పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చించినట్లు పేర్కొన్నారు. కేవలం 15 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో సైతం డబల్ ఇంజన్ సర్కార్ వస్తే రాష్ట్రం అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చక పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. జిల్లాలో నెలకొన్న సమస్యలతోపాటు పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలను మండలిలో చర్చించాలని ఎమ్మెల్సీ ని కోరారు.
జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత మొదటిసారిగా జిల్లా కేంద్రానికి వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీని, జిల్లా అధ్యక్షున్ని శాలువా కప్పి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగేలా నాగేశ్వరరావు, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, బిజెపి నాయకులు విజ య్, మురళి, గోనే శ్యాంసుందర్, మల్లారెడ్డి, రఘునాథ్, కృష్ణకుమారి, సొల్లు లక్ష్మి, ఏమా జీ, బోనగిరి సతీష్, మల్లికార్జున్, సతీష్, ప్రసాద్ గౌడ్, అన్ని మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.