ఆర్వో, బోరు నీళ్ల వాడకాన్ని తగ్గించాలి: మంత్రి సీతక్క
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటిపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించేలా చర్య లు చేపట్టాలని అధికారులను గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. వేల కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథ వ్యవస్థను ఏర్పాటు చేసినా ప్రజలు ఇంకా ఆర్వో ప్లాంట్లు, బోరు నీళ్లపై ఆధారపడటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం సచివాలయంలో మిషన్ భగీరథ బోర్డు సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న శుద్ధమైన తాగునీటిపై ప్రతి గ్రామపంచాయతీలో ప్రజలకు అవగాహన కల్పించాలనల్నారు. ఆర్వో నీరు, బోరు నీటి ద్వారా దీర్ఘకాలంలో ఏ విధమైన సమస్యలు తలెత్తుతాయో ప్రజల కు వివరించాలన్నారు.
ప్రజలు విధిగా మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటిని వినియోగించేలా ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించాలని సూచించారు. మిషన్ భగీరథ నాణ్యతను ప్రజలకు వివరించేలా రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ లోకేశ్‌కుమార్, మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి హాజరయ్యారు.