calender_icon.png 6 March, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఫాసిస్ట్ విధానాలపై పోరాడాలి

06-03-2025 12:42:18 AM

నల్లగొండ, మార్చి 5 (విజయక్రాంతి) : కేంద్రంలోని బీజేపీ సర్కారు ఫాసిస్ట్ విధానాలపై లౌకికవాద శక్తులన్నీ ఏకమై పోరాడాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌తో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ అనుసరిస్తున్న విజభన రాజకీయాలు దేశ సమగ్రతకే పెనుముప్పుగా పరిణమించాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ర్టంలో బీజేపీని నిలువరించడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దొందూ.. దొందేనని, పరస్పరం విమర్శించుకోవడం తప్ప సైద్దాంతికంగా, రాజకీయంగా బీజేపీపై పోరాడడం లేదని ఆక్షేపించారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో దారుణం విఫలమైందని ఆరోపించారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంటూ కాంగ్రెస్ సర్కారు పబ్బం గడుపుకుంటోందన్నారు. 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దని సుప్రీంకోర్టు చెప్పినా అన్ని తెలిసి రాష్ర్ట ప్రభుత్వం కులగణనను ముందుకు తేవడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. 

సర్కారు నిర్లక్ష్యం వల్లే టన్నెల్ ప్రమాదం

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎస్సెల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిందని తమ్మినేని మండిపడ్డారు. సొరంగం తొవ్వేటప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా సర్కారు తీరు ఉందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పనులు పూర్తిచేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రధాన పార్టీలు పరస్పర విమర్శలు మాని బాధిత కుటుంబాలను ఆదుకోవాలని హితవు పలికారు.

సమావేశంలో సీపీఎం ఖమ్మం, నల్లగొండ జిల్లా కార్యదర్శులు నూనె నాగేశ్వర్‌రావు, తుమ్మల వీరారెడ్డి, రాష్ర్ట కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హషం,వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు రవినాయక్, ఎండీ సలీం, నాయకులు మల్లు గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు, కోడి రెక్క మల్లయ్య, అరుణ, పల్లా భిక్షం పాల్గొన్నారు.