25-03-2025 01:33:30 AM
జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
హనుమకొండ, మార్చి 24 ( విజయ క్రాంతి): క్షయ వ్యాధి నిర్మూలనకు సకాలంలో క్రమం తప్పకుండా వైద్యచికిత్స పొందడం క్షయ , మందులు వాడడం ద్వారా వ్యాధిని నివారించవచ్చునని, క్షయ రహిత సమాజాన్ని నిర్మించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు.
మార్చి 24 ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవంను పురస్కరించుకొని కాకతీయ మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఐదు గ్రామాలను క్షయ వ్యాధి రహిత గ్రామాలుగా ప్రకటించడం జరిగిందని ఆమె తెలిపారు. క్షయ వ్యాధి నిర్మూలనకుగాను డాక్టర్లు సిఫారసు చేసిన ప్రకారం క్రమం తప్పకుండా మందులు వినియోగించడంతో పాటు సకాలంలో పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని ఈ వ్యాధి ప్రాణాంతకమైన వ్యాధికాదని కలెక్టర్ తెలిపారు.
(అవును మనం టీబి ని అంతం చేయగలం) భాగస్వాములు అందరూ సంకల్పంతో కృషి చేయడం, లోపాలను గుర్తించి సరిదిద్దడం, మెరుగైన సేవలు అందించడం ద్వారా 2025 నాటికి టీబి రహిత తెలంగాణ రాష్ట్రం, భారతదేశం కోసం కృషి చేయడం జరుగుతున్నది. హనుమకొండ జిల్లాలోని 26 ప్రభుత్వాసుపత్రులను కలుపుకొని సేవలు అందించేందుకు గాను మూడు ట్రీట్మెంట్ యూనిట్స్గా హనుమకొండ , ముల్కనూరు, పరకాల లో పనిచేస్తున్నాయి వ్యాధి నిర్ధారణ మరియు ఫాలో అప్ సేవల కోసం జిల్లాలో 6 డిజిగ్నేటెడ్ మైక్రోస్కోపిక్ కేంద్రాలు పనిచేస్తున్నాయి.
జిల్లా క్షయ నివారణ కేంద్రంలో సిబి నాట్ , ట్రూ నాట్ మిషన్స్ , వ్యాధి నిర్ధారణ కోసం కాకతీయ వైద్య కళాశాలలో టీబీ కల్చర్ డిఎస్టి లేబరేటరీ పని చేస్తున్నది. ప్రతి టీబి వ్యాధిగ్రస్తునికి మంచి పోషకాహారం తీసుకు నేనెందుకు నెలకు రూ. వెయ్యి రూపాయల నగదు, చికిత్స కాలంలో అతని ఖాతాలోకి జమ చేయబడుతున్నది, అలాగే ఖరీదైనటువంటి మందులు పూర్తిగా ఉచితంగా అందించడం జరుగుతున్నది. 2022లో టీబి కేసుల నమోదు గతంతో పోలిస్తే 40 శాతం తగ్గినందుకుగాను జిల్లాకు సిల్వర్ మెడల్ అందించడం జరిగింది అన్నారు.
2024లో టీబీలక్షణములు ఉన్న 22770 మందికి గాను 20956 (92%) పరీక్షలు నిర్వహించడం జరిగింది. టీబీ వ్యాధి నిర్ధారించిన 1848 మందికి చికిత్స అందించడం జరిగింది (హనుమకొండ ట్రీట్మెంట్ యూనిట్ పరిధిలో 1088,పరకాల ట్రీట్మెంట్ యూనిట్ పరిధిలో 237,ముల్కనూరు పరిదిలో 208) అలాగే 774 మందికి నిక్షయ్ పోషణ ద్వారావారి చికిత్స కాలంలో నెలకు వెయ్యి రూపాయల చొప్పున వారి ఖాతాలో జమ చేయడం జరిగింది .2025 జనవరి నుండి ఇప్పటివరకు 363 కేసులు గుర్తించడం జరిగింది.
డాక్టర్తో పాటు వారి సహాయకులు పూర్తిగా స్వచ్ఛందంగా సేవలు అందించాలని, క్షయ నిర్మూలన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాగ స్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ ప్రపంచ క్షయ వ్యాధి దినం సందర్భంగా 24 మార్చ్ సోమవారం రోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలకు అనుగుణంగా ఉదయం 9 గంటలకు భద్రకాళి టెంపుల్ ఆర్చ్ నుండి కాకతీయ వైద్య కళాశాల వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం వ్యాధిగ్రస్తులకు స్వచ్ఛందంగా సేవలు అందిస్తామని ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య, వైద్యదికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.