calender_icon.png 18 October, 2024 | 5:03 AM

అతివిశ్వాసంతోనే ఓడిపోయాం

18-10-2024 01:22:30 AM

  1. తప్పులు సరిదిద్దుకొని ప్రజల్లోకి వెళ్లాలి
  2. అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ గెలిచింది
  3. వచ్చే ఎన్నికల్లో యువ నాయకులకు సీట్లు
  4. బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు
  5. తెలంగాణ భవన్‌కు వచ్చిన ప్రభుత్వ బాధితులు

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నాయకుల అతివిశ్వాసమే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమని, కొన్ని తప్పులను సరిదిద్దుకొని ప్రజల్లోకి వెళ్లి.. వారి మనసులు దోచుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.

ఎవరికి అధికారం ఇవ్వాలో ప్రజలకు బాగా తెలుసని, అందుకే మనకు రెండుసార్లు అధికారం ఇచ్చారన్నారు. కొందరు నాయకులు చేసిన తప్పిదాలు, కాంగ్రెస్ అడ్డగోలు హామీలతో అధికారం కోల్పోయినట్లు వాపోయారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ విద్యార్థి సంఘం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

త్వరలో అన్ని జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు, ఫీజు రియెంంబర్స్ వంటి అంశాలను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. పార్టీలో చురుకైన యువ నాయకులకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని, వచ్చే ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా చేస్తామన్నారు. జిల్లాల వారీగా కమిటీ నియమించి పార్టీ బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర విద్యార్థి నేతలకు సూచించారు.

సీఎం రేవంత్‌కు సామాజిక అంశాలపై కనీస పరిజ్ఞానం లేదని వికారాబాద్ వెళ్లి హైదరాబాద్‌కు మూడు వైపులా సముద్రం ఉందంటూ పరువు తీశాడని ఎద్దేవా చేశారు. ఆగస్టు 15న చేసిన ప్రసంగంలోనూ భాక్రాంనగల్ తెలంగాణలో ఉందని నవ్వుల పాలయ్యాడన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏ కష్టమొచ్చినా గాంధీభవన్, బీజేపీ ఆఫీస్ వైపు వెళ్లకుండా తెలంగాణ భవన్‌కు వస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో వైట్‌కోట్ విప్లవం తెచ్చామని, ధాన్యం ఉత్పత్తిలో నెంబర్‌వన్ చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. రేవంత్ పాలనలో స్కూళ్లలో కనీసం చాక్‌పీస్‌లకు కూడా పైసలు లేని దుస్థితి నెలకొందన్నారు. గురుకులాలకు అద్దె కట్టకుండా బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్లు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ప్రశ్నించకపోతే తెలంగాణకు మరింత అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్ కంటే అతి ప్రమాదకరమైన పార్టీ బీజేపీ అని, తెలంగాణ ప్రజలు ఆ పార్టీని నమ్మొద్దని సూచించారు. 

పైసా లాభం లేకుండా 25 సార్లు ఢిల్లీకి..

పైసా లాభం లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి పది నెలల్లో 25 సార్లు హస్తినా పర్యటన చేపట్టారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు. గురువారం ఎక్స్‌వేదికగా స్పందిస్తూ ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాలతో అన్నదాతల అరిగోస పడుతున్నారని, గాల్లో దీపాల్లా గురుకులాలు ఉండగా, కుంటుపడ్డ వైద్యం గాడి తప్పిన విద్యా వ్యవస్థగా మారిందన్నారు. మూసీ పేరుతో -ఒక పక్క, హైడ్రా పేరుతో మరో వైపు  పేదోళ్ల పొట్టలుగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశం గర్వించదగ్గ గిరిజన వీరుడు కుమ్రంభీం

పోరాటాల పోతుగడ్డ మీద పుట్టిన అడవి తల్లి ముద్దుబిడ్డ కుమ్రంభీం అని కేటీఆర్ పేర్కొన్నారు. కుమ్రంభీం భీం వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు. జల్, జంగల్, జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడి.. తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచారన్నారు.

బీఆర్‌ఎస్ హయాంలో కొండలు, కోనల్లో ఉన్న ప్రతి గూడేనికి, తండాకు స్వచ్ఛమైన నీళ్ల అందించి విషజ్వరాల నుంచి విముక్తి కల్పించామన్నారు. 4 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములపై హక్కులు కల్పిస్తూ అడవి బిడ్డలకు పట్టాభిషేకం చేశామని తెలిపారు. 2,471 గిరిజన పంచాయతీలను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు.

ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురుల రాజ్యం

ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురుల ఇష్టారాజ్యం నడుస్తుందని, కాంగ్రెస్ పాలన శాండ్ మాఫియాకు అభయ హస్తంగా మారిందని కేటీఆర్ విమర్శించారు. రాష్ర్టం లో ఏ మూలన చూసినా విచ్చలవిడిగా ఇసుక దందా సాగుతుందని,  మంత్రుల నుంచి మండల స్థాయి లీడర్ల దాకా ఇసుకను పిండి దండిగా ధనాన్ని దండుకుంటు న్నారని ఆరోపించారు. నదులు, వాగులు, వంకలను కొల్లగొట్టి ఖజానాకు చేరాల్సిన సొమ్మును కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు.

తెలంగాణ భవన్‌కు జనాల తాకిడి

మూసీ బాధితులు, ఆశావర్కర్లు, ఆటో యూనియన్ల రాకతో తెలంగాణ భవన్ జన సందోహంగా మారింది. పెద్ద సంఖ్యలో వాహనాల రాకతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. తమ సమస్యల కోసం ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు తమకు మద్దతివ్వాలని పలు యూనియన్ల నాయకులు కేటీఆర్‌ను కోరారు.

వారి సమస్యలను విన్న కేటీఆర్.. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని, సమస్యల పరిష్కారానికి సంపూర్ణ మద్దతిని స్తామన్నారు. 30 ఏండ్లుగా మూసీ పరివాహక ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నామని, రేవంత్ సర్కార్ తమ ఇండ్లను కూల్చివేయాలని నిర్ణయం తీసుకోవడం ఆవేదన కలిగిస్తుందని బాధితులు కేటీఆర్‌కు తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో తమను అన్నివిధాలా ఆదుకున్నారని గుర్తు చేశారు.

ప్రభుత్వం నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఆశా వర్కర్లు సైతం కేటీఆర్‌ను కలిశారు. బీఆర్‌ఎస్ పాలనలో ఆశాలకు రూ.9,900 వేతనం ఇచ్చామని కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక వారి సమస్యలను పట్టించుకోకుండా వెట్టిచాకిరి చేయిస్తుం దని కేటీఆర్ విమర్శించారు.

వెయ్యిమందికి ఒక ఆశా వర్కర్ నింబం ధనను ప్రభుత్వం తుంగలో తొక్కి 4 వేల మందికి ఒకరు ఉండేలా చేస్తుందన్నారు.  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తమ జీవితాలు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్ల యూనియన్లు కేటీఆర్ వద్ద తమ గోడును వెలబోసుకున్నాయి. స్పం దించిన కేటీఆర్ తాము ఆందోళన కార్యక్రమంలో పాల్గొని ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని అన్నారు.

గ్రూప్1 మెయిన్స్ అభ్యర్థుల డిమాండ్లు పరిశీలించాలి

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థుల డిమాం డ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పం దించాలని కేటీఆర్ కోరారు. అభ్యర్థులే కోరినప్పటికీ ప్రభుత్వం ఎందు కు మొండి పట్టుదలకు పోతోందని ప్రశ్నించారు. ఎగ్జామ్స్ రీ షెడ్యూల్ చేయాలంటూ అశోక్‌నగర్‌లో ఆందోళన చేపట్టిన అభ్యర్థులను అరెస్ట్ చేయడం సరికాదన్నారు.

వారిని వెంటనే విడుదల చేయాలని, వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. గురువారం తెలంగాణ భవన్‌కు వచ్చిన అభ్యర్థులతో సమావేశమైన అనంతరం మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షంగా గ్రూప్ వన్ మెయిన్స్ అభ్యర్థుల పోరాటానికి అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. న్యాయపరంగా కావాల్సిన సాయం అందిస్తామని, అదే విధంగా ఎగ్జామ్స్ ను రీ షెడ్యూల్ చేసేందుకు ప్రభుత్వం ఒత్తిడి పెంచుతామని హామీ ఇచ్చారు.