calender_icon.png 31 October, 2024 | 4:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వం కోల్పోయాం.. మేమెలా బతకాలయ్యా?

13-09-2024 02:20:41 AM

నిలువ నీడలేదు.. కట్టుబట్టలతో రోడ్డున పడ్డాం  

  1. పిల్లల పుస్తకాలు, సర్టిఫికెట్లునా దక్కలేదు..
  2. అప్పు తెచ్చి పండించిన పంట వరద పాలైంది..
  3. కేంద్ర బృందం ఎదుట వరద బాధితుల ఆవేదన
  4. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో బృందం పర్యటన
  5. వారికి వరద నష్టాన్ని వివరించిన కలెక్టర్లు

ఖమ్మం/సూర్యాపేట, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ‘అయ్యా.. వరదలు వచ్చి సర్వం కోల్పోయాం. ఉన్న కాస్తంత గూడు దెబ్బతిన్నది. కట్టుబట్టలతో రోడ్డున పడ్డాం. పిల్లల సర్టిఫికెట్లు, పుస్తకాలు, సామాన్లు వరద పాలయ్యాయి. వాన తర్వాత ఇంట్లో బురద చేరిం ది. చెదిరిన గూడు ఎందుకూ పనికి రాకుండాపోయింది. వేలాది రూపాయలు పెట్టుబ డి పెట్టి పంటలు పండించాం. వరద దెబ్బకు పంట నీట మునిగింది. మిగిలిన పంటలో ఇసుక మేట వేసింది.

మున్నేరు మమ్మల్ని నట్టేట ముంచింది’ అంటూ వరద బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. గురువారం కల్నల్ కీర్తిప్రతాప్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర బృందం సభ్యులు ఖమ్మంలో పర్యటించగా, వారికి సమస్యలను ఏకరవు పెట్టారు. కూలీ నాలీ చేసుకుని సంపాదించినదంతా వరద పాలైందని కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఎవరో దాతలు వచ్చి ఇంత తిండి పెడితే తప్పితే గతి లేకుండా పోయిందని రోదించారు. నగర శివారులో చెరువులు, కాల్వలు, నాలాలు, కుంటలను కబ్జాకోరులు ఆక్రమించడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని వాపోయారు. ఆక్రమణల చెర నుంచి నీటి వనరులను కాపాడి.. భవిష్యత్‌లో మళ్లీ వరదలు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

క్షేత్రస్థాయిలోకి వెళ్లి నష్టం అంచనా

ఖమ్మం నగర పర్యటన అనంతరం మొదటి కేంద్ర బృందం ఖమ్మం నగర పరిధి, శివారులోని పోలేపల్లి రాజీవ్ గృహకల్ప, కాల్వ ఒడ్డు, బొక్కలగడ్డ, ప్రకాశ్‌నగర్ బ్రిడ్జి, మోతీనగర్ ప్రాంతాల్లో పర్యటించింది. వరదకు దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసింది. రెండో బృం దం ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెం,  తల్లంపాడు, తెల్దారుపల్లి, తనగంపాడు మున్నేరు పరీవాహక ప్రాంతాల్లో పర్యటించింది. వరదల కారణంగా ఖమ్మం నగరంతో పాటు యావత్ జిల్లా తీవ్రంగా నష్టపోయిందని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ కేంద్ర బృందానికి వివరించారు.

నగరంలో మొత్తం 13 డివిజన్లలో నష్ట తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. అన్ని ప్రభుత్వశాఖలకు కలిపి రూ. 729.68 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. వరదల ధాటికి 15,258 ఇండ్లు దెబ్బతిన్నాయన్నారు. వరదల్లో చిక్కుకుని ఆరుగురు మృత్యువాతపడ్డారన్నారు. 63,936 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. రైతులకు రూ.63,93,60,000 మేర నష్టం వాటిల్లిందన్నారు. త్వరలోనే కేంద్ర బృందం సేకరించిన వివరాలను కే్రందానికి సమర్పించి, వరద బాధితులు సరైన న్యాయం జరిగేలా చూస్తామని బృందానికి నాయకత్వం వహించిన కల్నల్ కీర్తిప్రతాప్ సింగ్  వెల్లడించారు. పర్యటనలో బృంద సభ్యులు మహేశ్‌కుమార్, శాంతినాథ్ శివప్ప,  ఎస్‌కే కుష్వాహా, టీ నియాల్ కన్సన్,  డాక్టర్ శశివర్ధన్‌రెడ్డి ఉన్నారు.

శరవేగంగా పునరావాసం 

ఖమ్మం, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): మున్నేరు శాంతించడంతో ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్వయంగా కాలనీల్లో పర్యవేక్షిస్తూ, సిబ్బందికి తగు సూచనలు ఇస్తున్నారు. వరదల కారణంగా నగరంలో ని 11, 16, 17, 28, 29, 30, 34, 35, 46, 47, 48, 59, 60 డివిజన్లలో ఇళ్లు దెబ్బ తిని, నష్టం వాటిల్లింది. బొక్కలగడ్డ, మోతీన గర్, వెంకటేశ్వరనగర్, జూబ్లీక్లబ్ వెనుక, ప్రకాశ్‌నగర్, సాయినగర్, ఆర్టీసీ కాలనీ, నాయుడుపేట, తదితర 13 డివిజన్లలో 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఆ బృందాలు 9,292 కుటుంబాలను కలిసి, సర్వే చేసి, డాటా ఎంట్రీ పనులు పూర్తి చేస్తున్నాయి. ధ్వంసలాపురం, రామన్నపేట, జూబ్లీక్లబ్, ప్రభుత్వ మహిళా కళాశాల, స్వర్ణభా రతి ఫంక్షన్ హాలులో ప్రత్యేక రిలీఫ్ క్యాంపులు నిర్వహించి, 7,700 మందిని తరలించారు. వారికి వసతితోపాటు 9 రోజులపాటు భోజనాలు అందించారు. 28 వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, బ్లాంకెట్లు, దుస్తులు అందజేశారు. ఇంకా అవసరమైన చోట అందజేస్తూనే ఉన్నా మని అధికారులు చెప్తున్నారు. 

980 మంది పారిశుద్ధ్య కార్మికులు

మున్నేరు పరివాహాక ప్రాంతాల్లో పారి శుద్ధ్య పనుల కోసం 980 మంది పారిశు ద్ధ్య కార్మికులను వినియోగిస్తున్నారు. ఖమ్మం నగర పాలక సంస్థ నుంచి 690 మంది, వరంగల్ నుంచి 150 మంది, వివిధ పంచాయతీల నుంచి 130 మందికి పైగానే రప్పించారు. 37 జేసీబీలు, 60 ట్రాక్టర్లు, 59 వాటర్ ట్యాం కర్లు, 30 స్వచ్చ ఆటోల ద్వారా పనులు నిర్వహిస్తున్నారు. ఫైర్ ఇంజిన్ల ద్వారా రోడ్లు, ఇళ్లలోని బురదను తొలిగిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నారు. విద్యుత్‌ను పునరుద్ధరిస్తూ,పడిపోయిన స్తంభాల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేస్తున్నారు.

దెబ్బతిన్న సబ్‌స్టేషన్‌ను పునరుద్ధరి ంచారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో సర్టిఫికెట్స్ పోగొట్టుకున్న వారి కోసం 8 ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి, దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వారం రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించి, రెండో వారంలో సర్టిఫికెట్ల జారీకి చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, ప్రభుత్వానికి సహకరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ విజ్ఙప్తి చేశారు.  

సారూ.. మీరే ఆదుకోవాలి..

‘అనుకోకుండా కురిసిన భారీ వర్షం వరదలతో మంచెత్తింది. అపార నష్టం మిగిల్చివెళ్లింది. వరదల పంటలను నీటముంచింది. ఇండ్లను దెబ్బతీసింది. రోడ్డున పడ్డాం సారూ.. మమ్మల్ని మీరే ఆదుకోవాలి’ అంటూ సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్ వరద బాధితులు గురువారం కేంద్ర బృందం ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. గోండ్రియాల, తొగర్రాయి, కాగిత రామచంద్రా పురం, బూరుగడ్డలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి బాధితులతో మాట్లాడారు. పొలాల్లో ఇసుక మేటలను పరిశీలించారు.

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్  జిల్లావ్యాప్తంగా సంభవించిన వరద నష్టాన్ని వివరించారు. వరద బీభత్సానికి సంబంధించిన ఫొటోలను తిలకించారు. నష్టం పై నివేదిక రూపొందించి కేంద్రానికి సమర్పిస్తామ ని, తద్వారా బాధితులకు సాయం అందేలా చూస్తామని కేంద్ర బృందం తెలిపింది. పర్యటనలో ఆర్డీవో సూర్యానారాయణ, డీఏవో శ్రీధర్‌రెడ్డి, రెవన్యూశాఖ అధికారులు ఉన్నారు.