calender_icon.png 20 April, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లొస్తాం..అంజన్నా..

14-04-2025 12:54:29 AM

  1. ముగిసిన హనుమాన్ జయంతి ఉత్సవాలు 
  2. మూడో రోజూ కొనసాగిన జన జాతర 
  3. కాషాయ మయమైన కొండగట్టు

జగిత్యాల, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): ’చల్లగ చూడు అంజన్నా.. మళ్లీ వస్తాం అంజన్నా...’ అంటూ భక్తి పారవశ్యంతో పాడుతూ, ’జై శ్రీరామ్’ నామం పలుకుతూ భక్తులంతా తిరుగు ప్రయాణమయ్యారు. జిల్లాలోని సుప్రసిద్ధ కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు ఆదివారం ముగిశాయి.

గత 3 రోజుల పాటూ నిర్వహించిన వేడుకలకు రాష్ట్రం నలు మూలల నుండి సుమారు 2 లక్షల 50 వేల మంది దీక్షా స్వాములు, భక్తులు స్వా మివారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. 3 రోజులపాటూ ఆలయ ప్రాంగణం, పరిసరాలు ఆంజనేయస్వామి దీక్షా స్వాముల భజనలు, కోలాటాలు, పాటలతో మార్మోగింది. ఆలయంలో మూలవిరాట్టు, ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. 

ఆదివారం సాయంత్రం ముగింపు సందర్భంగా జయంతి ఉత్సవాల ఉద్వాసన ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ముగించారు. కాగా  కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ముగియడంతో ఉత్సవ కమిటీ చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దిగ్విజయంగా జయంతి ఉత్సవాలు ముగియడంలో కీలక పాత్ర పోషించిన పోలీస్, రెవెన్యూ, ఆలయ సిబ్బంది, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు వెలమ లక్ష్మారెడ్డి, కచ్చర లక్ష్మి చారి, సంత ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.