calender_icon.png 23 January, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనిస్తాం

23-01-2025 05:48:43 PM

ఐటీడీఏ పిఓ రాహుల్...

భద్రాచలం (విజయక్రాంతి): సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ద్వారా గిరిజన మహిళలు జీవనోపాధి పెంపొందించుకొని ఆర్థిక వేసులు బాటు కల్పించుకొని, జీవించడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. గురువారం నాడు తన ఛాంబర్ లో ఎంఎస్ఎంఈ యూనిట్ పథకము ద్వారా జూలూరుపాడు మండలం జై జగదాంబ మేరమ్మ యాడి రెడీమేడ్ గవర్నమెంట్ మగ్గం కేంద్రం సొసైటీ సభ్యురాలు నాగమణికి రూ. 2.12 లక్షలు సబ్సిడీ క్రింద విడుదలైన చెక్కును అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 06 గురు మహిళలు సొసైటీ ఏర్పాటు చేసుకొని కుట్టు శిక్షణ తీసుకొని వివిధ రకాల డిజైనింగ్ లో కుటుంబాలలోని సభ్యులకు పనికివచ్చే బట్టలు ఎంబ్రాయిడరింగ్, జిగ్ జాగ్, కుట్లు, అల్లికలు డిజైనింగ్, మగ్గం ద్వారా బట్టలు తయారు చేసి చుట్టుపక్కల గ్రామాలలో అమ్మకాలు జరిపి జీవనోపాధి పెంపొందించుకోవడం అభినందించదగ్గ విషయమని అన్నారు.

ఈ పరిశ్రమ స్థాపించుకోవడానికి యూనిట్ కాస్ట్ 27లక్షల 70వేలని, 16 లక్షల 62 వేలు సబ్సిడీ లభించిందని, సెల్ఫ్ కంట్రిబ్యూషన్ 2,77,000 కట్టామని, మిగతాది బ్యాంకు ద్వారా రుణము తీసుకొని ఈ పరిశ్రమ స్థాపించుకున్నారని అన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకెవరైనా గిరిజన మహిళలు మగ్గం వర్క్ లో శిక్షణ తీసుకోవడానికి ముందుకు వస్తే తప్పకుండా శిక్షణ అందించి తప్పనిసరిగా సొంతంగా ఎంఎస్ఎంఈ యూనిట్ ద్వారా వారికి నచ్చిన పరిశ్రమలు స్థాపించుకోవడానికి సహకారం అందించడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.