- నిలువ నీడ లేదు.. తాగటానికి నీళ్లు లేవు
- అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో మిగిలాం
- అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది
- ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం
- కేంద్ర బృందానికి వరద బాధితుల మొర
- ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో పర్యటన
- వరద నష్టం వివరాలు సేకరించిన బృందం
- వరద బాధితులతోను మాట్లాడిన సభ్యులు
హైదరాబాద్/ఖమ్మం/హనుమకొండ, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): ఎన్నడూ ఊహించనిరీతిలో సంభవించిన వరదలకు తమ బతుకులు చిద్రమయ్యాయి.. గొడ్డు గోదా ఆగమయ్యాయి.. జీవనాధారమైన పశువులను కోల్పోయాము.. అన్నీ పోగొట్టుకుని రోడ్డున పడ్డాం.. తినడానికి దాచుకున్న తిండిగింజలు, డబ్బు, బంగారం, బట్టలు, పిల్లల పుస్తకాలు, సర్టిఫికేట్లు, భూముల పాసు పుస్తకాలు సర్వం వరదల్లో కోల్పోయి కట్టుబట్టలతో మిగిలాం.. ఇప్పుడు మాకం టూ ఏమీ మిగలలేదు.. జీవచ్చవాల్లా బతుకుతున్నాం..
నిలువ నీడ లేక, కట్టుకునేం దుకు సరైన బట్టలు లేక, వండుకుందామంటే తిండి గింజలు లేక, బతకలేక, కంటి మీద కునుకు కరవై నికృష్టంగా బతుకుతు న్నాం.. మమ్మల్ని మీరే ఆదుకోలి.. అని వరద బాధితులు కేంద్ర బృందానికి మొరపెట్టుకొన్నారు. బుధవారం ఖమ్మం జిల్లాలో వరద నష్టం అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం ముందు బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ గోడు వెళ్లబోసుకున్నారు. చంటి పిల్లలకు పాలు పట్టలేని దుస్ధితిలో ఉన్నామని, చేతిలో చిల్లి గవ్వ లేక సాయం కోసం అర్ధిస్తూ పట్టెడన్నం కోసం ఆశగా ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవత్వంతో ఆదుకోవాలని, లేకుంటే తమకు చావే శరణ్యమని రోధించారు.
విస్తృతంగా పర్యటన
కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని ఆరుగు రు సభ్యుల కేంద్ర బృందం బుధవారం హైదరాబాద్ నుంచి నేరుగా పాలేరు నియోజకవర్గానికి చేరుకుని వరద ప్రభావిత ప్రాం తాల్లో విస్తృతంగా పర్యటించి, బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించింది. తొలుత కూసుమంచి మండలం భగత్‌వీడు వద్ద ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అక్కడ నుంచి ఖమ్మం రూరల్ మండ లం గూడూరుపాడు, తనగంపాడు గ్రామాలను సందర్శించి, దెబ్బతిన్న పంట పొలాల ను పరిశీలించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను కూడా తిలకించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ఆ ప్రాంతంలో జరిగిన నష్టాన్ని వారికి వివరించారు.
తర్వాత బృందం కస్నా తండా వద్ద ముంపు ప్రాంతా న్ని పరిశీలించింది. అక్కడి నుంచి తిరుమలాయపాలెం మండలం వెళ్లి వరదలకు పూర్తిగా దెబ్బతిన్న రాకాసితండ ప్రాంతాన్ని పరిశీలించారు. మున్నేరు, ఆకేరు వరదలతో నష్టపో యిన ప్రాంతాలను కూడా సందర్శించారు. ఎంవీ పాలెంలో ఇళ్లను , పంట పొలాలను పరిశీలించి,నష్టం వివరాలు సేకరించారు. కేంద్ర బృందం రెండు బృందాలుగా విడిపోయి వరద ప్రాంతాల్లో పర్యటించారు. మరో బృందం కూసుమంచి మండలం జుజ్జుల్‌రావుపేటలో పీఆర్ రోడ్లు, కల్వర్టులు, పాలేరులో గండిపడిన ప్రదేశాన్ని కూడా పరిశీలించింది. నర్సింహుగూడెం నానుతండా వద్ద వరదలో మునిగిపోయిన పంట పొలాలు, ఇళ్లను పరిశీలించారు.
ఎర్రగడ్డ తండా వద్ద దెబ్బతిన్న భక్తరామదాసు ప్రాజెక్టును కూడా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వారితో ఉండి, జరిగిన నష్టాన్ని వివరించారు. విపత్తుల వల్ల జిల్లా మొత్తం మీద అన్ని శాఖల పరిధిలో రూ. 729.68 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి తెలిపారు. 15,258 ఇళ్లు దెబ్బతిన్నాయని, 77,821 పశు సంపద నష్టపోయా మని చెప్పారు. వరదల్లో ఆరుగురు ప్రాణా లు కోల్పోయారని వివరించారు. మైనర్ ఇరిగేషన్ చెరువులు, కాల్వలు తదితర వాటికి సంబంధించి రూ.434,07,30,236 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
జిల్లా వ్యా ప్తంగా 68,345 ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న, పెసర తదితర పంటలకు రూ. 68,34,50,000 కోట్ల మేర నష్టం వాటిల్లిం దని జిల్లా కలెక్టర్ కేంద్ర బృందానికి వివరించారు. కీర్తి ప్రతాప్ సింగ్ నాయకత్వంలోని ఈ బృందంలో మహేశ్‌కుమార్, శాంతినాథ్ శివప్ప, ఎస్‌కే కుశవహ, నాయకన్ సన్, డాక్టర్ జీ శశివర్ధన్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
నష్టాన్ని కేంద్రానికి వివరిస్తాం
వరదలతో రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తామని కేంద్ర బృందం సభ్యులు హామీ ఇచ్చారు. గురువారం కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వివరాలు సేకరిస్తామని చెప్పారు. రెండు రోజుల పర్యటన పూర్తి కాగానే నష్టం వివరాలను ఢిల్లీ వెళ్లి కేంద్రానికి నివేదిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ చెప్పిన వివరాలన్నీ నోట్ చేసుకున్నామని చెప్పారు.
విపత్తుకు కారణం ఏంటో తేల్చండి: కేంద్ర బృందం
రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ వరద ల కారణంగా సంభవించిన నష్టాలను, ఆపదలో ఉన్న ప్రజలకు తక్షణ సహాయం అం దించడానికి రాష్ర్ట ప్రభుత్వ కృషిని కేంద్ర బృందానికి వివరించారు. నష్టం ప్రాథమిక అంచనాలు రూ.5,438 కోట్లుగా ఉన్నాయని, పూర్తిస్థాయి అంచనా ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని తెలియజేశారు. వ్యవసాయం, రోడ్లు, భవనాలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, ఇంధనం, పశుసంవర్ధక, అటవీ శాఖల ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జరిగిన నష్టాన్ని వివరించారు. అయితే ఈ పర్యావరణ విపత్తుకు మూల కారణాన్ని తెలుసుకోవడానికి సమగ్ర అధ్యయనం చేయాలని కేంద్ర బృందం సీఎస్‌కు సూచించింది. సచివాలయంలో వరదలపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర బృందం ఖమ్మం, మహబూబాబాద్‌లో పర్యటించింది.
అరవిందకుమార్ నేతృత్వంలో మరో బృందం పర్యటన
రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ ) శాఖ ప్రధాన కార్యదర్శి అరవిందకుమా ర్ నేతృత్వంలోని మరో బృందం బుధవారం పాలేరు నియోజకవర్గంలో పర్య టించి వరద నష్టాన్ని అంచనా వేసింది. ఈ బృందం కూసుమంచి మండలం మల్లాయిగూడెం, భద్రుతండా, పాలేరు, ఎర్రగడ్డ తండా తదితర ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించింది. గ్రామాల్లో ఇసు క మేటలు, మట్టితో నిండిన పొలాలు, కొట్టుకుపోయిన వంతెనలు, రోడ్లు, దెబ్బతిన్న ఇళ్లు, సర్వం కోల్పోయి కట్టుబట్టల తో మిగిలిన కుటుంబాలను కలిసి మాట్లాడారు.
మహబూబాబాద్ జిల్లాలో పర్యటన
కేంద్ర బృందం బుధవారం సాయం త్రం మహబూబాబాద్ జిల్లాలో కూడా పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించింది. మరిపెడలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించింది. బృందం సభ్యులు పలువురి బాధితుతో మాట్లాడా రు. వరదల కారణంగా సర్వం కోల్పోయామని బాధితులు కన్నీటి పర్యంతమ య్యారు. ఇండ్లు ధ్వంసమై, పశువులు చనిపోయి బతుకు దెరువు లేకుండా పోయిం దని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.
కేంద్ర సాయం అనివార్యం: సీఎస్
రాష్ట్రంలో విపత్తుల సవాళ్లను అధిగమించేందుకు రాష్ట్రానికి కేంద్రం సాయం అనివార్యమని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కేంద్ర బృందానికి నివేదించారు. రాష్ట్ర బృం దాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహా య కార్యక్రమాలను అందించడానికి వీలుగా మార్గదర్శకాలను రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరి స్థితుల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో సమానంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని సీఎస్ తెలియజేశారు. ఆ ప్రత్యేక బృం దాలకు శిక్షణ, ఇతర లాజిస్టిక్స్ ఏర్పాట్ల లో ఎన్‌డీఎంఏ మద్దతు కావాలని కోరారు.
వరద నష్టం అంచనా కోసం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం బుధవారం ఉదయం సచివాలయంలో సీఎ స్‌తో పాటు ఉన్నతాధికారులతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన నష్టం, ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎస్ వివరించారు. రాష్ర్ట ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవడం వలన ప్రాణనష్టం తగ్గిందని తెలిపారు. భారీ వర్షాల సమయంలో ఎయిర్ రెస్క్యూ ఆపరేషన్ సమస్యను కూడా సీఎస్ ప్రస్తావించారు. ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో 332 హెక్టార్ల విస్తీర్ణంలో భారీ చెట్లు కూలిన సంఘటనలను, పర్యావరణ సమస్యను కూడా కేంద్ర బృందానికి సీఎస్ వివరించారు.