29-03-2025 08:29:55 PM
బిఆర్ఎస్ కులవృత్తులను బలోపేతం చేస్తే కొందరు ఎగతాళి చేశారు..
ఈ 15 నెలల్లో కులవృత్తులు కుదేలయ్యాయి..
బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..
కామారెడ్డి (విజయక్రాంతి): బీసీ నాయకత్వాన్ని తమ పార్టీ బిఆర్ఎస్ బలోపేతం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రెంట్ ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డిలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీ నాయకత్వం బలపడడానికి టిఆర్ఎస్ ఐదుగురిని రాజ్యసభకు పంపించడంతో పాటు 8 మందిని ఎమ్మెల్సీలను చేసిందని, 58 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఇచ్చి పెద్ద పిట వేసిందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ బీసీ పదవి గతంలో ఎప్పుడు బీసీలకు దక్కలేదని, మొట్టమొదటిసారి రవీందర్ యాదవ్ ను కెసిఆర్ వీసీ చేశారనీ, అలాగే అడ్వకేట్ జనరల్ గా బీసీ బిడ్డ అయినా ప్రసాద్ ను నియమించిన ఘనత కేసీఆర్ ది అని అన్నారు.
టిఆర్ఎస్ హయాంలో పదేళ్లలో బీసీలకు 1,55 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని, కులవృత్తులను బలోపేతం చేస్తుంటే కొంతమంది ఎగతాళి చేశారన్నారు. కానీ గత 15 నెలలుగా కులవృత్తులు ఏ విధంగా కుదిలయ్యాయి చూస్తున్నామని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లుల స్థితిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని, ఈ బిల్లులను కేంద్రం ఆమోదించడంపై కాంగ్రెస్, బిజెపి పార్టీలు సమాధానం చెప్పాలన్నారు. బీసీల బిల్లులను కేంద్రం ఆమోదించేలా రాష్ట్ర బిజెపి ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. గ్రామాలు, కులాల వారిగా ప్రభుత్వం జనాభా లెక్కలను బయట పెట్టాలన్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు.
కామారెడ్డి డిక్లరేషన్లు కేవలం రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కానీ తమ పోరాటం వల్ల విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లను పెంచుతూ చట్టాలు చేసిందన్నారు. రాష్ట్రంలో 50% పరిమితి కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేశామన్నారు. ఈ సమావేశంలో మాజీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలు తానోబ సుమిత్ర ఆనంద్ రావు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎదురు గట్ల సంపత్ గౌడ్, మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు, ప్రభాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కపిల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.