అంతర్జాతీయ బ్రోకరేజ్ సీఎల్‌ఎస్‌ఏ యూటర్న్
న్యూఢిల్లీ, నవంబర్ 15: తాము గతంలో ఇండియా ఈక్విటీ నుంచి చైనా స్టాక్స్‌వైపు వ్యూహాత్మకంగా మార్చిన ఫోకస్‌ను ఇప్పుడు రివర్స్ చేస్తున్నామని, చైనా మార్కెట్ పెట్టుబడుల్ని తగ్గించి, వాటిని భారత్‌కు మళ్లిస్తామని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ సీఎల్‌ఎస్‌ఈ ప్రకటించింది. యూఎస్ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో చైనా మార్కెట్లకు ఎదురయ్యే సవాళ్లరీత్యా తమ ఫోకస్ తిరిగి భారత్ వైపు పెట్టామని సీఎల్‌ఏస్‌ఏ తాజా రిపోర్ట్‌లో వెల్లడించింది.
విజయ సంకేతాలు కన్పించిన ప్రాంతంలో కూడా దురదృష్టం వెంటాడుతుందని, గత వారంరోజులుగా చైనా ఈక్విటీల ద్వారా అది వెల్లడయ్యిందని, ట్రంప్ 2.0తో వాణిజ్య యుద్ధం తీవ్రతరమై చైనా వృద్ధికి ఊతమైన ఎగుమతుతులపై ప్రభావం పడుతుందని సీఎల్‌ఎస్‌ఏ వివరించింది.
ఇండియా వెయిటేజిని సగానికి తగ్గించాం
వ్యూహాత్మకంగా భారత్‌లో ఉన్న ఈక్విటీ పెట్టుబడుల్లో కొంత చైనాకు మళ్లించాలని అక్టోబర్ తొలినాళ్లలో నిర్ణయించామని, తదుపరి రోజుల్లో మరిన్ని చైనా పెట్టుబడులకు కమిట్ అయ్యామని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఇందుకు అనుగుణంగా ఇండియా ఓవర్‌వెయిట్‌ను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించి, తమ చైనా పెట్టుబడి కేటాయింపుల్ని 5 శాతం పెంచామని, ఆ ట్రేడ్‌ను ప్రస్తుతం రివర్స్ చేస్తున్నట్లు సీఎల్‌ఎస్‌ఏ వెల్లడించింది.
ట్రంప్ యం త్రాంగం నుంచి చైనా అధిక టారీఫ్‌లను చవిచూస్తుందని, ఆ దేశంలో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగ్గాలేవని, ఆస్తుల ధరలు క్షీణిస్తున్నాయని, నిరుద్యోగం పెరుగుతున్నదని, కోవిడ్ పాండమిక్ సమయానికన్నా రిటైల్ అమ్మకాల వృద్ధి పడిపోయిందని బ్రోకరేజ్ పేర్కొంది. మరోవైపు ట్రంప్ ట్రేడ్ పాలసీ ప్రభావం ఇండియాపై తక్కువగా ఉంటుందని, కరెన్సీ స్థిరత్వంలో భారత్ ఒక ఒయాసిస్‌లాంటిదని సీఎల్‌ఎస్‌ఏ అభివర్ణించింది.
ఈ మధ్యకాలంలో డాలరు విలువతో చూస్తే చైనా, ఇండియా మార్కెట్లు రెండూ 10 శాతం తగ్గినందున, పెట్టుబడుల్ని చైనా నుంచి ఇండియాకు మళ్ళిస్తే తాము నష్టపోయేది ఏమీ ఉండదని పేర్కొంది.