వనపర్తి, జనవరి 21: జనవరి 26 నుండి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అర్హులైన ప్రతి లబ్ధిదారులను ఎంపిక చేసి లబ్ధి చేకూర్చేందుకు గ్రామసభలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సంక్షేమ పథకాల మంజూరు కోరుతూ ప్రజాపాలన సందర్భంగా ప్రజలు దరఖాస్తు చేసుకోగా అట్టి దరఖాస్తులను జనవరి 16 నుండి 20 వరకు అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయడం జరిగింది.
రూపొందించిన జాబితా లో ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, ఇంకా అర్హత ఉన్న లబ్ధిదారులు ఎవరైనా ఉన్నారా అనే విషయాలను ప్రజల సమక్షంలో తెలుసుకోడానికి జనవరి 21 నుండి 24 వరకు గ్రామ సభలు, వార్డు సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మంగళవారం మొదటి రోజు ఘనపూర్ మండలంలోని ఉప్పరిపల్లి, పెద్దమందడి మండలంలోని చీకర చెట్టు తాండా, ముందరి తాండా గ్రామాల్లో జరిగిన గ్రామ సభలకు జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి తో పాటు స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
గ్రామ సభను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకే అందాలనే ఉద్దేశ్యంతో అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి అర్హులైన వారి జాబితా రూపొందించడం జరిగిందన్నారు. ఈ జాబితాలో ఇంకా ఏమైనా మార్పు చేర్పులు ఉన్నాయా అనేది ప్రజల సమక్షంలో పెట్టీ ప్రజల అభిప్రాయాలు, సూచనలు తీసుకురావడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను పార్టీలకతీతంగా, అత్యంత పారదర్శకంగా నిజమైన ప్రతి లబ్ధిదారునికి పథకం ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, 5 లక్షల ఆరోగ్యశ్రీ నీ 10 లక్షలకు పెంచడం జరిగిందన్నారు.
మరో 4 సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, భూమి లేని నిరుపేద కూలీలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సంవత్సరానికి 10 వేల నుండి 12 వేల రూపాయలకు పెంచిన రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ వంటి సంక్షేమ పథకాలు ప్రారంభించబోతున్నారనీ తెలిపారు.
ఈ సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకే అందే విధంగా గ్రామ సభలు పెట్టీ ప్రజల ఆమోదంతో అర్హులకే లబ్ధి చేకూర్చేందుకు ఈ గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, ఘనపూర్ మండల ప్రత్యేక అధికారి సుధీర్ రెడ్డి, తహసిల్దార్, ఎంపీడీఓ లు, ఎంపిఒ లు, పంచాయతీ సెక్రటరీ లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.