calender_icon.png 11 October, 2024 | 2:30 AM

మనసున్న వ్యక్తిని కోల్పోయాం

11-10-2024 12:00:00 AM

టాటా గ్రూప్ చైర్మన్, దిగ్గజ పారిశ్రామిక వేత్త మరణం ప్రతి ఒక్కరినీ బాధిస్తోంది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రతన్ టాటా తుది శ్వాస విడిచారు. ఆయన మరణంపై టాలీవుడ్ ప్రముఖులంతా స్పందించారు. 

* భారతీయులందరికీ ఇదొక దుర్దినం. సేవలో రతన్ టాటాను మించిన వారు లేరు. దేశం చూసిన గొప్ప దార్శినికుల్లో ఆయన ఒకరు. గొప్ప పారిశ్రామికవేత్త, పరోపకారి, అసాధారణ మానవతావాది రతన్ టాటా.  మంచి మనసున్న వ్యక్తిని కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా                               

చిరంజీవి

* పారిశ్రామిక రంగంలో ఒక దిగ్గజాన్ని కోల్పోయాం. రతన్ టాటా ఔదార్యం, వివేకం, నిబద్దత ప్రపంచంపై చెరగని ముద్ర వేశాయన్నారు. ఆయన తీర్చిదిద్దిన జీవితాల్లో ఆయన ఆత్మ ఎప్పటికీ జీవించే ఉంటుంది.

మహేశ్ బాబు

* పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాది బంగారం లాంటి హృదయం. ఆయన నిస్వార్థ సేవా గుణం, దూరదృష్టి కలిగిన నాయకత్వం లెక్కలేనన్ని జీవితాలను మార్చేసింది. భారతదేశం ఆయనకెప్పుడూ రుణపడి ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా.

 ఎన్టీఆర్

* లెజెండ్స్ ఎప్పటికీ జీవించే ఉంటారు. టాటా ఉత్పత్తులను వినియోగించని రోజును ఊహించలేను. నిత్య జీవితంలో టాటా వారసత్వం కనిపిస్తూనే ఉంటుంది. పంచ భూతాల మాదిరిగానే ఆయన ఎప్పటికీ మనతో ఉంటారు. లెక్కలేనన్ని జీవితాలను ప్రభావితం చేసినందుకు ధన్యవాదాలు. 

రాజమౌళి

* పరోపకారి, లక్షలాది మందికి ఆశాజ్యోతి, స్వచ్ఛమైన బంగారం లాంటి మనసు కలిగిన వ్యక్తి,  ఎందరికో స్ఫూర్తిదాయకం రతన్ టాటా. కష్టంలో ఉన్న ఎందరికో వెలుగునిచ్చేందుకు నక్షత్రంలా మారి వెలుగులీనుతున్నారు. ఆయనలా మరెవరూ ఉండలేరు. రతన్ టాటా లేరని ప్రపంచం కన్నీళ్లు పెట్టుకుంటోంది

ఖుష్బూ

* రతన్ టాటా ప్రయాణం నిజమైన నాయకత్వానికి నిదర్శనం. విలువలతో తరతరాలకు మార్గనిర్దేశం చేశారు. వినయం, గొప్పతనం ఒకేచోట ఉంటాయని నిరూపించారు. భారత దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.

  మోహన్ బాబు

* మీ వంటి లెజెండ్ జన హృదయాలను ఎప్పటికీ వీడలేరు. మీ వారసత్వం ప్రతి హృదయంలో జీవించి ఉంటుంది. మీరు పంచిన విలువలు, వెలుగులు మాకు ఎప్పటికీ మార్గదర్శకం                                       

రవితేజ

* దేశం గర్వించే పారిశ్రామికవేత్త రతన్ టాటా. సింప్లిసిటీ, సిన్సియారిటీకి మీరు ఉదాహరణగా నిలిచారు. దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమను విశ్వవ్యాప్తం చేసిన ఘనత మీదే

నరేశ్ విజయకృష్ణ

* నాయకత్వానికి, పరోపకారానికి, నైతిక విలువలకు రతన్ టాటా ఒక ఐకాన్. ఆయన వారసత్వం మరెన్నో జెనరేషన్లను ప్రభావితం చేస్తూనే ఉంటుంది. భారతదేశం ఒక దిగ్గజాన్ని కోల్పోయింది

రానా దగ్గుబాటి 

* వినయంలోనే నిజమైన వారసత్వం ఉందని రతన్ టాటా నిరూపించారు. దేశం కోసం ఎన్నో సేవలందించారు. కొన్ని తరాల్లో స్ఫూర్తి నింపారు. టాటా వారసత్వం నాతో పాటు ఎందరికో నిజమైన బలం వినయంలోనే ఉంటుందని నేర్పింది. 

మంచు మనోజ్