calender_icon.png 19 September, 2024 | 6:59 AM

వెయ్యేండ్ల కోసం పునాదులేశాం

17-09-2024 01:08:59 AM

  1. గ్రీన్ ఎనర్జీలో మన నిబద్ధతకు ఎదురులేదు 
  2. ఆదర్శ సౌర నగరంగా అయోధ్య 
  3. దేశంలో మరో 16 నగరాల గుర్తింపు 
  4. 4వ గ్లోబల్ రెనువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌లో ప్రధాని

గాంధీనగర్, సెప్టెంబర్ 16: ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు అయిన వాతావరణ మార్పులకు భారత్ పరిష్కారం చూపుతున్నదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రకృతి మనకు సరిపోను వనరులు ఇచ్చిందని, అవసరం మేరకే వాడితే ఏ సమస్యా ఉండదని.. దురాశకు పోవటం వల్లనే అనర్ధాలు జరుగుతున్నాయ ని పేర్కొన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సోమవారం 4వ అంతర్జాతీయ పున ర్వినియోగ హరిత ఇంధన పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని మాట్లాడారు. జాతిపిత మహాత్మాగాంధీ జీవన విధానమే వాతావరణ మార్పుల సమస్యకు చక్కటి పరి ష్కారమని పేర్కొన్నారు.

మహాత్ముడు తన నిత్యజీవితంలో అతి తక్కువ కర్బన ఉద్గారాలు ఉత్పత్తి అయ్యే వస్తువులనే వాడుతూ జీవించారని, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చా రు. ‘వాతావరణ మార్పుల సమస్యను ప్రపంచం కనీసం గుర్తించని కాలంలోనే మహాత్ముడు ఈ ఉత్పాతం గురించి ప్రపంచాన్ని హెచ్చరించారు. ఆయన జీవితంలో అతి తక్కువ కర్బన ఉద్గారాలు విదులయ్యేలా చూసుకొన్నారు. ఈ భూమి మన అవసరాలకు సరిపోయే స్థాయిలో వనరులు ఇచ్చిందని, దురాశకు సరిపోయేంతగా కాదని చెప్పారు.

మనకు గ్రీఫ్ ఫ్యూచర్, నెట్ జీరో అనేవి ఫ్యాన్సీ పదాలు కాదు. అవి మన నిబద్ధతకు చిహ్నాలు. అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం ఈ లక్ష్యాలు సాధించే నిబద్ధత నుంచి మినహాయింపు పొందవచ్చు. ఈ రంగాల్లో ఏమీ చేయబోమని చెప్పి ఊరుకోవచ్చు. కానీ మనం అలా చేయలేదు. భవిష్యత్తులో మానవత గురించే మన ఆందోళన అంతా. వచ్చే వెయ్యి సంవత్సరాల సంక్షేమం కోసం నేడు భారత్ పునాదులు వేస్తున్నది’ అని మోదీ పేర్కొన్నారు.  

సోలార్ సిటీలుగా 17 నగరాలు

ఈ ఏడాది ప్రారంభంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన అయోధ్యను మోడల్ సోలార్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని ప్రకటించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. అయోధ్య తరహా లోనే అభివృద్ధి చేసేందుకు మరో 16 నగరాలను గుర్తించామని పేర్కొన్నారు. రాముడి జన్మస్థానం అయోధ్య. ఆయన సూర్యవంశానికి చెందినవాడు. మోడల్ సోలార్ సిటీ లక్ష్యాన్ని సాధించబోతోందని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నా.

ఈ పని దాదాపు పూర్తయింది అని తెలిపారు. 1,000 ఏళ్ల వరకు కావాల్సిన ప్రగతి ప్రణాళికలకు సంబంధించిన ప్రయత్నాలు గత 100 రోజు ల ట్రైలర్‌లో కనిపిస్తున్నాయని అన్నారు. హరిత భవిష్యత్తు, నెట్ జీరో ఎమిషన్ కోసం నిబద్ధతతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఉన్నత స్థానానికి చేరుకోవడమే కాకుండా అక్కడే స్థిరంగా ఉండేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో తగినన్ని చమురు, గ్యాస్ నిల్వలు లేవని తమకు తెలుసని, అందుకే సోలార్, పవన, అణు, హైడ్రో విద్యుత్‌పై దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు.      

ఏటా రూ.25 వేల ఆదాయం  

గుజరాత్ పర్యటనలో భాగంగా గాంధీనగర్‌లో సూర్యఘర్ ఉచిత లబ్ధిదారులతోనూ సోలార్ వ్యవస్థ గురించి ప్రధాని మాట్లాడారు. దేశంలో సోలార్ పవర్ పాలసీని గుజరాత్ రూపొందించిందని, దాన్ని దేశవ్యాప్తంగా విస్తృతం చేశామని చెప్పారు. సూర్యఘర్ పథకం ద్వారా ప్రతి ఇల్లు విద్యుత్ ఉత్పత్తి చేయాలని, దాంతో ఏటా ఆదాయంతో పాటు కాలుష్యాన్ని తగ్గించవచ్చని సూచించారు. పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు 1.3 కోట్లకుపైగా కుటుంబాలు నమోదు చేసుకున్నాయని మోదీ తెలిపారు. వీరు తమ ఇంటి వినియోగానికి విద్యుత్‌ను ఉత్పత్తితో పాటు గ్రిడ్‌కు కూడా విక్రయిస్తూ ఏటా రూ.25 వేలు ఆదాయం పొందుతున్నారని వెల్లడించారు.      

నేనుంటే ఎవరి పెత్తనం చెల్లదు

తాను ఉన్నంత వరకూ ఎవరి పెత్త నం చెల్లదని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఏ విధమైన ఒత్తిడికి గురికానని స్పష్టం చేశారు. సంకీర్ణ రాజకీయాలపై స్పందిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. వివిధ దేశాలు చాలా లక్ష్యాలు నిర్దేశిస్తున్నాయి. స్థానిక రాజకీయాలు మీపై ఏమై నా ఒత్తిడి తెస్తున్నాయా? అని ఓ పాత్రికేయుడు నన్ను అడిగారు. దానికి.. ఇక్కడ ఉన్నది మోదీ. ఇక్కడ ఎవరి పెత్తనం చెల్లదని సమాధానమిచ్చా అని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించలేదని, జేడీ యూ, టీడీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.