calender_icon.png 22 September, 2024 | 5:10 PM

31,221 కోట్లు కేటాయించినా.. మీకు కనిపించడం లేదా?

28-07-2024 03:48:59 AM

  1. కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం దుర్మార్గం 
  2. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ 

కరీంనగర్, జూలై 27 (విజయక్రాంతి): తెలంగాణకు గత తొమ్మిదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ. 31,221 కోట్లు ఖర్చు చేసిందని, యూపీఏ కంటే 20 రెట్లు ఎక్కువ నిధులు కేటాయించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు రూ. 5,336 కోట్లు కేటాయించినా అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయడం దుర్మార్గమని ఫైరయ్యారు. ఈ కేటాయింపులు మీకు కనిపించడం లేదా అని కాంగ్రెస్ నేతలను సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి లక్షా 9 వేల కోట్లకుపైగా నిధులను కేంద్రమే సమకూరుస్తున్నా, పైసా ఇవ్వలేదని తీర్మానం ఎలా చేస్తారని మండిపడ్డారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అసత్య ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో రూ. 32,946 కోట్ల వ్యయంతో నూతన రైల్వే ట్రాక్ నిర్మిస్తున్నామని, ఇప్పటికే 100 శాతం రైల్వే విద్యుద్దీకరణ పనులు పూర్తి చేశామని తెలిపారు. రూ. 715 కోట్ల ఖర్చుతో రాష్టంలో 437 ఆర్‌వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణం, కరీంనగర్, పెద్దపల్లి రామగుండం సహా 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు, చర్లపల్లిలో నూతన టెర్మినల్ పనులు పూర్తి చేశామన్నారు. జీఎస్టీ ఆదాయంలో 74 శాతం సొమ్ము తిరిగి రాష్ట్రానికే వస్తుందని, గతంలో 32 శాతం ఉన్న డివాల్యుయేషన్ ఫండ్‌ను 42 శాతానికి పెంచామని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో తెలం గాణకు రూ. 6,177 కోట్ల ప్రత్యేక సహాయం చేసిందన్నారు.

గత పదేళ్లలో రూ. 10 లక్షల కోట్లకుపైగా నిధులు కేటాయించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ట్యాక్స్ డివాల్యుయేషన్, వివిధ కేంద్ర పథకాల అమలు కోసం 6 లక్షల 75 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. వడ్లు, పత్తి సేకరణకు లక్షా 60 వేల కోట్లు ఖర్చు చేశామని, కిసాన్ సమ్మాన్ కింద 35 లక్షల మంది రైతులకు 9 వేల కోట్లు జమ చేశామని, వడ్లకు కనీస మద్దతు ధర కింద 27 వేల కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. ఉపాధి హామీ ద్వారా 23 వేల కోట్లు ఖర్చు చేశామని, జన్‌ధన్ ఖాతాలో 1 కోటి 13 లక్షల మందికి రూ. 3,600 కోట్లు జమ చేశామని, గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద కోటి 91 లక్షల మందికి బియ్యం పంపిణీ చేశామని గుర్తు చేశారు. 14, 15వ ఫైనాన్స్ కమిషనర్ ద్వారా పంచాయతీలకు రూ. 12,580 కోట్లు, 30 లక్షల టాయిలెట్లు, 5.5 లక్షల ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. హైవేల నిర్మాణానికి లక్షా 15 వేల కోట్లు, గ్రామీణ సడక్ యోజన కింద 1,100 కోట్లు ఖర్చు చేసి 4 వేల కిలోమీటర్ల మేరకు రోడ్లు నిర్మించామన్నారు.   

భక్తులకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి

కాళేశ్వరం ఆలయ సాంప్రదాయాలు పాటించకుం డా బీఆర్‌ఎస్ నేతలు గుర్భగుడిలోకి ప్రవేశించడం దుర్మార్గమని బండి సంజయ్ ఫైరయ్యా రు. కేటీఆర్ నాస్తికుడని, హిందూ సనాతన ధర్మాన్ని అవమానించేలా వ్వవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు.