calender_icon.png 24 October, 2024 | 10:51 PM

మా ఇద్దరి మధ్య మంచి భాగస్వామ్యం ఉంది

02-08-2024 12:05:00 AM

“వరుణ్ ధావన్‌తో కలిసి పని చేయటం ఆనందంగా ఉంది. వర్క్ పట్ల అంకితభావంతో ఉంటాడు. మంచి మనసున్న వ్యక్తి. మా ఇద్దరి మధ్య మంచి భాగస్వామ్యం నెలకొంది. అందువల్ల ‘సిటాడెల్’ చిత్రీకరణ చక్కగా పూర్తి చేశాం. 12 నిమిషాల నిడివి గల యాక్షన్ సీన్‌ను సింగిల్ టేక్‌లో షూట్ చేశాం” అంటూ బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌తో ఉన్న అనుబంధం గురించి తెలిపింది సీనియర్ హీరోయిన్ సమంత. ఆమె వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్ : హనీ బన్నీ’ కోసం ప్రేక్షకులు సుమారు ఏడాది కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుందీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.

ఈ మేరకు ముంబయిలో గురువారం నిర్వహించిన ఈ సిరీస్‌కు సంబంధించి టీజర్ వేడుకలో విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుందని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడతూ.. పైవిధంగా వరుణ్ ధావన్ గురించి తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఇంకా సిరీస్ గురించి చెప్తూ.. ‘ఈ సిరీస్‌ను ప్రేక్షకులకు చూపించేందుకు దాదాపు ఏడాది నుంచి ఎదురుచూస్తున్నాం.

యాక్షన్ ప్రియులకు తప్పకుండా నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చింది. జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారు? అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమంత ఆసక్తికరమైన బదులిచ్చింది. ‘కొన్ని సార్లు నేనూ చేతులెస్తాను. అయితే, అక్కడితో కథ ముగిసిపోయినట్టు కాదు.. నేను తిరిగి పైకి లేస్తా’ అని జవాబిచ్చింది.