calender_icon.png 4 October, 2024 | 11:03 AM

కృష్ణా జలాలతో చెరువులు నింపుతాం

04-10-2024 12:33:51 AM

  1. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం
  2. పేదలకు త్వరలో ఇందిరమ్మ ఇండ్లు 
  3. రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ, అక్టోబర్ 3 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి చెరువులన్నింటినీ కృష్ణాజలాలతో నింపుతామని రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు.

నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన పేదలందరికీ త్వరలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు చిత్తశుద్ధితో ఉందన్నారు. నల్లగొండ పట్టణంలో రూ.500 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా రూ.400 కోట్లతో 11 లక్షల లీటర్ల సామర్థ్యంగల 15 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నట్టు వివరించారు. బ్రాహ్మణవెల్లంల, ఎస్సెల్బీసీ ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలోని చెరువులన్నీ కృష్ణానీటితో కళకళలాడతాయని పేర్కొన్నారు. ఎంజీయూ వెంట రూ. 25 కోట్లతో పర్యాటకశాఖ హరిత హోటల్ నిర్మించనున్నట్టు తెలిపారు.

రూ. కోటితో ప్రకాశం బజార్‌లో మటన్ మార్కెట్‌ను నిర్మించామని, వ్యాపారులు దీన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మార్కెట్‌లో దుకాణాలు దక్కనివారు నిరాశపడొద్దని అవసరమైతే మరోచోట నిర్మించి ఇస్తామని హామీఇచ్చారు. స్లాటర్ హౌస్ నిర్మాణానికి వెంటనే స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్ నారాయణరెడ్డిని ఆదేశిం చారు.

ప్రకాశం బజార్‌లో గోల్డ్ షాపుల వివాదాన్ని 15 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బొట్టుగూడలో రూ.3 కోట్లతో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల భవనాన్ని డిసెంబర్‌లోగా అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం మాన్యం చెలక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులు, జైలుఖానా చౌరస్తాను మంత్రి పరిశీలించారు.

అంతకుముందు రూ. కోటి 10 లక్షలతో చంద్రగిరి విల్లా, మస్రంపల్లి రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. 47వ వార్డుకు చెందిన ఎంబీబీఎస్ రెండో సంవత్సరం విద్యార్థిని యశ్వనితకు రూ. 60 వేలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్‌గౌడ్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.