దోమకొండ కేజీబీవీ విద్యార్థినుల డిమాండ్
వేరే చోటకు బదిలీ చేయాలని ఆందోళన
కామారెడ్డి, నవంబర్ 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ కేజీ బీవీ పాఠశాల ఎదుట శుక్రవారం విద్యార్థినులు ఆందోళన చేశారు. బీబీపేట నుంచి స్పెషల్ ఆఫీసర్‌గా వచ్చిన మంగమ్మ, మరో ముగ్గురు సిబ్బంది తమకొద్దని, వారిని వెం టనే బదిలీ చేయాలని కోరుతూ పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. గతంలో దోమకొండలో పనిచేసిన ఎస్వో, సిబ్బందిని తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు.
బీబీపేట కేజీబీవీ విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన ఎస్వో మంగమ్మను తమ పాఠశాలకు ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. బదిలీలను విరమించుకునే వరకు అన్నం తినకుండా ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి విషయాన్ని తేల్చాలని ఎంఈవో విజయ్‌కుమార్‌ను పట్టుబట్టారు. ఆయన డీఈవో, ఇతర జిల్లా అధికారులతో మాట్లాడి ఎస్వో మంగమ్మ, ముగ్గురు సిబ్బందిని బదిలీ చేస్తామని చెప్పిన ఆందోళన విరమించలేదు. పోలీసులు వచ్చి ఉన్నతాధికారులతో మాట్లాడటంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.