calender_icon.png 23 November, 2024 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాకు పునరావాసం వద్దు

23-10-2024 12:13:22 AM

  1. సుందరీకరణ పేరుతో ఇళ్లను కూల్చొద్దు
  2. ఫణిగిరి కాలనీలో మూసీ నిర్వాసితుల నిరసన
  3. ఇంటి గేట్లకు కోర్టు పిటిషన్ ఫ్లెక్సీలు

ఎల్బీనగర్, అక్టోబర్ 22: చైతన్యపురి, కొత్తపేట డివిజన్‌లోని మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇళ్లకు సంబంధించి అధికారులు మార్క్ వేసినప్పటి నుంచి స్థానికులు నెలరోజులుగా నిద్రాహారాలు మాని కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం చైతన్యపురి డివిజన్‌లోని ఫణిగిరికాలనీలోని మూసీ పరీవాహక ప్రాంతవాసులు సాయిబాబా ఆలయ సమీపంలో సమావేశయ్యారు. వారు మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం తప్పుడు సర్వే చేపడుతోందని, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిని.. ప్రాంతాలు, ఓట్ల ఆధారంగా నిర్ణయించారని ఆరోపించారు.

కొన్నిప్రాంతాల్లో పరిధి తక్కువ చూపి, కేవలం చైతన్యపురి, కొత్తపేట డివిజన్ల్‌లోని మూసీ ప్రాంతంలో పరిధిని ఎక్కువ చూపారని మండిపడ్డారు. ‘మూసీ పునరావసం వద్దు.. మా ఇండ్లే మాకు ముద్దు’ అని నినదించారు. ఇళ్లు కూల్చే బదు లు మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టి, సుందరీకరణ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు నర్పింహప్రసాద్, పూజారి చిరంజీవితోపాటు ఫణిగిరి కాలనీవాసులు పాల్గొన్నారు.

పిటిషన్ ఫ్లెక్సీలు ఏర్పాటు

ఫణిగిరి కాలనీలో అధికారులు ఎరుపురంగుతో మార్క్ వేసిన ఇండ్ల యజమా నులు హైకోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టులో కేసు వేశామని.. మా ఇంటి జోలికి రావొద్దని ఫ్లెక్సీ కట్టారు. ఫణిగిరి, సత్యానగర్, వినాయకనగర్ కాలనీలో రెవెన్యూ అధికారులు మార్క్ వేసిన ప్రతి ఇంటి యజమాని ఇంటి పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

మేము హైకోర్టులో కేసు వేశామని, పిటిషన్ విచారణలో ఉందని ఇంటింటికీ ఫ్లెక్సీలను కట్టారు. కొం దరు రెవెన్యూ అధికారులు వేసిన మార్క్‌ను చెరిపివేసి, కోర్టు కేసు ఉందని రాశారు.