అనంతగిరి కొండలలోని దామగుండం అటవీ ప్రాంతంలో దాదాపు రూ.2,500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోయే వి.ఎల్.ఎఫ్. (వెరీ లో ఫ్రీక్వెన్సీ) రాడార్ స్టేషన్ ప్రాజెక్ట్ స్థాపనకై వైజాగ్‌లోని ఈస్టర్న్ నావల్ కమాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం 2,900 ఎకరాల భూములు కేటాయించడం దురదృష్టకరం. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం మూడింటి జలాలలోని జలాంతర్గాములు, నౌకలనుంచి వచ్చే సంకేతాల పర్యవేక్షణ కోసం ఇది పని చేస్తుందని తెలుస్తున్నది.
దేశంలోని 14 ప్రాంతాలలో ప్రపొజల్స్ ఉన్నాకూడా, కర్ణాటక ప్రభుత్వం మైనింగ్ భూములు ఇస్తామని ముందుకొచ్చినప్పటికీ వాటన్నింటినీ కాదని తెలంగాణ అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసే విధంగా దామగుండంలో ఏర్పాటు చేయడంలో గల పాలకుల దురుద్దేశం ఏమిటో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం 12 లక్షలకు పైగా చెట్లు నరికి వేయడం జంతు, పశు, పక్ష్యాదుల మనుగడకు జీవన్మరణ సమస్యే కానున్నట్టు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రాడార్ కేంద్రం స్థాపన పరిసర ప్రాంతాలపై తీవ్ర దుష్ప్రభావం చూపడంతోపాటు హైదరాబాద్ మహానగర సంబంధ ప్రకృతి రమణీయత అంతా వికృతంగా మారే ప్రమాదమూ ఉంది.
ఇది కనుక, కార్యరూపానికి వస్తే హైదరాబాద్‌కు తరచూ వరదలు వచ్చే అవకాశాలు ఉంటాయని, మూసీమీద కూడా తీవ్ర ప్రభావం పడుతుందని పర్యావరణ విశ్లేషకులు ఆందోలన చెందుతున్నారు. ఔషధ మొక్కలు, అరుదైన వృక్షాలతో జీవ వైవిద్యం కలిగిన ఆ ప్రాంత అడవిలోని చెట్లను నరకడాన్ని స్థానికులు, ప్రకృతి ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అయితే, ప్రజలు దశాబ్ద కాలం పాటు ‘దామగుండం అటవీ సంరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ’ పేరుతో పోరాటం చేశారు. ఈ అటవీ భూముల పరిరక్షణ కోసం గతంలో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంలో 12,12,753 చెట్లను నరికి వేసేందుకు అనుమతి ఇచ్చినట్లు అప్పటి అటవీ సంరక్షణ ప్రధానాధికారి హైకోర్టుకు తెలిపిన సంగతి విదితమే.
ఏమైనా, ఈ ప్రాజెక్ట్ పెను ప్రమాదంగా మారి మన పర్యావరణానికి యమగండంగా మారబోతుండడం బాధాకరం. ప్రాజెక్ట్‌కు కేటాయించిన భూములను, అన్ని అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్షించి వెంట నే రద్దు చేయడం శ్రేయస్కరం. ప్రాజెక్ట్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
చెన్న శ్రీకాంత్ బిసి, హైదరాబాద్