విక్కీ కౌశల్ తన హిస్టారికల్ -పీరియడ్ -యాక్షన్ డ్రామా చిత్రం ‘ఛావా’తో 2025 సంవత్సరాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాలో విక్కీ కౌశల్ సరసన రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తోంది. విక్కీ, రష్మిక కలిసి నటించడం ఇదే తొలిసారి. మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేశాయి. మూడు రోజులుగా వరుస అప్‌డేట్లతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్రబృందం తాజాగా బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.
ప్రేక్షకుల అంచనాలకు తగట్టుగానే మరో స్థాయిలో ఉందీ ట్రైలర్. దక్షిణాదికి చెందిన శివుడు, మరాఠాల ఛత్రపతి ఈ లోకాన్ని విడిచిపెట్టాడు.. త్వరలో మరాఠాల భూమిని కూడా మొఘలులు పరిపాలించనున్నారు అనే వాయిస్ ఓవర్‌తో సినిమా ట్రైలర్ ప్రారంభమవుతుంది. విక్కీ కౌశల్ పాత్ర ఛత్రపతి శంభాజీ మహారాజ్ శివుని భక్తిలో నిమగ్నమై అభిషేకించడం కనిపిస్తుంది.
‘ఛావా’ అంటే సిం హానికి పుట్టిన బిడ్డ, సింహం వారసుడు అని అర్థం. ఛావా ఇంకా అడవుల్లోనే తిరుగుతోందనే మాటతో ట్రైలర్ ప్రారంభమైంది. యాక్షన్ సీక్వెన్సులు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ‘మేం లొల్లి చేయం.. వేటాడతాం’ అంటూ విక్కీ మరాఠీలో చెప్పే డైలాగ్, ఆ విజువల్స్ ఎక్స్‌ట్రార్డినరీ. సింహాన్ని శంభాజీ చీల్చి చెండాడే సన్నివేశం నెక్స్ లెవల్ అని చెప్పాలి.
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అశుతోష్ రానా, డయానా పెంటీ, దివ్యా దత్తా, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలు పోషించనున్నారు. మడోక్ ఫిల్మ్ పతాకంపై దినేశ్ విజన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సౌరభ్ గోస్వామి; సంగీతం: ఏఆర్ రెహమాన్.