- తండ్రి హంతకురాలిని ప్రియాంక కౌగిలించుకున్నరు
- ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ
వయనాడ్, నవంబర్ 3: తాము దేశంలో ఎవ్వరినీ కూడా ద్వేషించబోమని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. తమ తండ్రి రాజీవ్‌గాంధీని చంపిన హంతకురాలు నళనిని తన సోదరి ప్రియాంకగాంధీ ప్రేమతో కౌగిలించుకున్నారని చెప్పారు. ఈ నెల 13న వయనాడ్ పార్లమెంట్ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రియాంక పోటీ చేస్తున్నారు.
ఈనేపథ్యంలో జిల్లాలోని మనంతవడిలో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్నర్ మీటింగ్‌లో తన సోదరి ప్రియాంకతో కలిసి రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నళినిని కౌగిలించుకున్న ప్రియాంక వ్యక్తిత్వాన్ని ఆయన కొనియాడారు. ఆ తరువాత ప్రియాంక తన దగ్గరకు వచ్చి భావోద్వేగానికి లోనయిందని అన్నారు.
ఆ సమయంలో నళినిని చూస్తే తనకు చాలా బాధేసిందని చెప్పిందని గుర్తు చేశారు. ప్రియాంకను సోదరిగా పొందడం అదృష్టమన్నారు. ప్రియాంక బెస్ట్ ఎంపీగా ప్రజలకు సేవ చేస్తారని హామీ ఇచ్చారు. వయనాడ్ ఉప ఎన్నిక ప్రేమ, ద్వేషాల మధ్య జరుగుతోన్న పోరాటమని ఆయన చెప్పారు.
వయనాడ్‌కు అండగా రాహుల్
కష్టకాలంలో ఎంపీగా గెలిపించిన వయనాడ్ ప్రజలకు రాహుల్‌గాంధీ ఎప్పుడూ అండగానే ఉన్నారని ప్రియాంకగాంధీ అన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో వయనాడ్ ప్రజలు చూపించిన తెగువ మరిచిపోలేనివని కొనియాడారు. ఇక్కడి ప్రజల కు పోరాడే ధైర్యం ఎక్కువని, అణిచివేతదారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని అన్నారు.
అన్ని మతాలకు చెందిన ప్రజలు ఇక్కడ కలిసిమెలిసి జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఎంతో బలమైన, ఘనమైన చరిత్ర ఇక్కడి ప్రజలకు ఉందని అన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తన దోస్తులైన వ్యాపారవేత్తల కోసమే ప్రధాని మోదీ పని చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల గురించి ఎన్నడూ ఆలోచించలేదన్నారు.