కార్యకర్తలచే ప్రతిజ్ఞ చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
హుస్నాబాద్ (విజయక్రాంతి): మద్యం సేవించమని, మద్యం సేవించి వాహనాలు నడపమని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరిస్తామని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించమని దసరా ఉత్సవాల సాక్షిగా, అమ్మవారి ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శనివారం హుస్నాబాద్ లోని ఎల్లమ్మ గుడి వద్ద జరిగిన దసరా ఉత్సవాలలో పాల్గొని పూజలు చేసిన అనంతరం కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 10 నెలల ప్రభుత్వ పాలనలో అనేక విజయాలు సాధించామన్నారు. హుస్నాబాద్ ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రూ.2 లక్షల లోపు గల పంట రుణాలను మాఫీ చేశామని, ఏదైనా సమస్యలతో రుణమాఫీ కాని రైతులు అధికారులను సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలోనే హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ లో రామ్ లీలా కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని, ప్రశాంతమైన వాతావరణంలో పండగ జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కెడం లింగమూర్తి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్ పర్సన్ అనిత రెడ్డి, నాయకులు శివయ్య, చందు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.