- పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో తీర్మానం
- పాత పద్ధతినే అమలు చేయాలని డిమాండ్
కోల్‌కతా, జూలై 24: వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఏకీకృత పరీక్ష నీట్ తమకు వద్దని పశ్చిమబెంగాల్ ప్రకటించింది. నీట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని తమిళనాడు అసెంబ్లీ గతంలోనే తీర్మానం చేసిన విష యం తెలిసిందే. తాజాగా పశ్చిమబెంగాల్ అసెంబ్లీ కూడా బుధవారం ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించింది. పాత విధానంలోనే మెడికల్ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని తీర్మానించింది.
ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉండగా, ప్రవేశ పరీక్షలు రాష్ట్రాల చేతుల్లోనే ఉండాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా బెంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్యబసు గుర్తుచేశారు. ప్రవేశపరీక్షలన్నీ కేంద్రం చేతిలో పెడితే దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. మంత్రి విమర్శలపై స్థానిక బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన మమత సర్కార్ నీట్ అవినీతిపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.