07-02-2025 01:28:40 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అనుకున్న స్థాయిలో జనంలోకి తీసుకెళ్లలేదని, ఈ విషయంలో విఫలమయ్యామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ, రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కల్పించామని, సన్నాలకు బోనస్ ఇచ్చామని తెలిపారు.
ఎన్‌హెచ్‌ఆర్డీలో గురువారం జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ, కులగణన అంశాలను ఆయా వర్గాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను పార్టీపరంగా అమలు చేస్తున్న విషయాన్ని వివరించాలన్నారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ చేసినప్పటికీ జనం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదని అభిప్రాయపడ్డారు. మిగిలిన వారికి కూడా రుణమాఫీ చేయాలని సూచించారు. కొంతమంది ఎమ్మెల్యేలను డిన్నర్ చేయడానికే కలిశామని, ఆ భేటీలో ఎలాంటి రహస్యం లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తెలిపారు.
తనకు పర్సనల్‌గా పైరవీలు లేవని, మంత్రులతో విభేదాలున్నట్లు వస్తు న్న వార్తల్లో నిజం లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, పనుల విషయంలో మాత్రమే మాట్లాడుకున్నట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లా డుతూ.. తమకు ఎలాంటి రహస్య సమావేశాలు లేవని చెప్పారు.జిల్లాలో ఏమైనా సమస్యలుంటే పార్టీపెద్దలకు చెప్పాలని సీఎం సూచించారని ఆయన తెలిపారు.
తీన్మార్ మల్లన్నతోపాటు కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దూరం
సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరుకాలేదు. బీసీ కులగణనపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో.. ఆయనకు పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా సీఎల్పీ సమావేశానికి దూరంగా ఉన్నారు.
పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలని కేటీఆర్ సుప్రీంకోర్టులో కేసు వేయగా.. అసెంబ్లీ కార్యదర్శి ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పుడు సీఎల్పీ సమావేశానికి హాజరైతే.. కాంగ్రెస్‌లో చేరినట్లుగా మరొక ఆధారం ఉంటుందని సీఎల్పీ సమావేశానికి దూరంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.