- జీవో నె.ం 29ను వెంటనే రద్దు చేయాలి
- బీజేపీ ఎంపీ డా. కె లక్ష్మణ్
హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో ప్రశాంతంగా ఆందోళన నిర్వహిస్తున్న గ్రూప్--1 అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం అమానుషమని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఓబీ సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా. కె.లక్ష్మణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నిరుద్యోగ యువతకు ఎన్నికలకు ముందు గంపె డాశలు చూపించి, హామీలు గుప్పించి ఓట్లు పొందిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. హాస్టళ్లలోకి చొరబడి విద్యార్థులను బయటకు గుంజుకొచ్చి రక్తం చిందేలా కొట్టడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు.
మహిళా అభ్యర్థులని కూడా చూడకుండా దారుణంగా లాఠీచార్జ్ చేయడాన్ని ఆయన ఖండించారు. నిరుద్యోగులు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. జీవో నెం.29 ఉత్తర్వులు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఈ జీవోతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.
జీవో 29 రద్దుతో పాటు పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరుద్యోగుల పక్షాన బీజేపీ ఉద్యమిస్తుందన్నారు. తదుపరి పరిణామాలకు రాష్ర్ట ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.