14-04-2025 12:27:20 AM
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఫైర్
కరీంనగర్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ అహంకార పూరిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు.
జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీ రజితోత్సవ సభ సన్నాహక సమావేశాల పేరుతో కాంగ్రెస్ పార్టీ పై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై, పిసిసి అధ్యక్షుడి పై అహంకారంగా మాట్లాడుతున్న కేటిఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.
ఏఐసిసి అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ను ఓటు ద్వారా ఎన్నుకున్నామని, పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించుకున్నామని, బిఆర్‌ఎస్ లో అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు తండ్రి కొడుకులే అని అన్నారు. నిన్న మీడియా సమావేశంలో ఒకవైపు కొప్పుల ఈశ్వర్ ఇంకొక వైపు గంగుల కమలాకర్ కూర్చున్నారని, వారిలో ఒక్కరికైనా అధ్యక్ష లేదా కార్యనిర్వాక అధ్యక్ష పదవి ఇవ్వచ్చుగదా అని నరేందర్ రెడ్డి అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క పిల్లర్ కు చిన్న పర్రె మాత్రమే వచ్చిందని సమర్థించుకోవడానికి సిగ్గనిపిస్తాలేదా అని నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. అది ఏ విధంగా క్రుంగింది ఎన్ని పిల్లర్లు పగిలినయో ప్రజలందరికీ తెలుసన్నారు. మూసి రివర్ ను పదకొండు వందల కోట్లతో శుద్ధి చేయొచ్చు అని అని అనడం విడ్డూరంగా ఉందన్నారు.
కేటిఆర్ అహంకార మాటలు మానుకోకపోతే బుద్ది చెప్పే రోజు వస్తుందని నరేందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో శ్రవణ్ నాయక్, దన్న సింగ్, రవీందర్ గౌడ్, కుర్ర పోచయ్య, తమ్మడి ఎజ్రా,మాసుం ఖాన్, మహమ్మద్ భారీ, అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.