calender_icon.png 27 September, 2024 | 4:55 AM

ఏ జట్టునైనా ఓడిస్తాం

25-09-2024 12:00:00 AM

  1. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 

యూఏఈ బయల్దేరిన టీమిండియా

మహిళల టీ20 ప్రపంచకప్

ముంబై: మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఏ జటునైనా ఓడించే సత్తా భారత్‌కు ఉందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా పొట్టి ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఆసియా కప్ అనంతరం భారత మహిళల జట్టు ఒక్క మ్యాచ్ ఆడకుండానే యూఏఈకి చేరుకోనుంది. 

మెగాటోర్నీలో గ్రూప్ ఉన్న భారత్ తమ తొలి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో అక్టోబర్ 4న ఆడనుంది. ఆ తర్వాత వరుసగా పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియాలను ఎదుర్కోనుంది. 2009లో తొలిసారి మహిళల టీ20 ప్రపంచకప్ నిర్వహించగా.. 2020లో భారత్ తొలిసారి ఫైనల్‌కు చేరుకున్న ప్పటికీ ఆసీస్ చేతిలో పరాజయం చవిచూసింది.

2023లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు పరిమితమైంది.టీమిండియా దుబాయ్ ఫ్లుటై ఎక్కనున్న నేపథ్యంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్.. హెడ్ కోచ్ అమోల్ మజుందార్‌తో కలిసి మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంది. 

అత్యుత్తమ జట్టుతో..

హర్మన్ మాట్లాడుతూ.. ‘ప్రపంచకప్‌కు అత్యుత్తమ జట్టుతో వెళ్లనున్నాం. జట్టులోని చాలా మంది ఆటగాళ్లు కొన్నేళ్లుగా కలిసి ఆడుతుండడంతో మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. 2023 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఓడి టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచిపోయాం. ఈసారి ఆ తప్పు జరగకుండా చూసుకుంటాం.

ప్రిపరేషన్‌కు సంబంధించి అన్ని విభాగాల్లో పూర్తిగా సిద్ధమయ్యాం. గత ప్రపంచకప్పులో చేసిన తప్పిదాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాం. ఆసియా కప్ ఫైనల్లో ఓడిపోవడం బాధాకరం. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్ రోజు మనది కాదు.. అందుకే ఓడిపోయాం. 19 ఏళ్ల వయసులో తొలి ప్రపంచకప్ ఆడాను.

కానీ ఎప్పుడు బరిలోకి దిగినా  రెట్టింపు ఉత్సాహంతో టోర్నీకి సిద్ధమవ్వడం అలవాటు. ఏ జట్టునైనా ఓడించే సామర్థ్యం మన జట్టుకు ఉంది. ఆస్ట్రేలియా ప్రమాదకర జట్టు కావొచ్చు.. కానీ వారిని ఓడిస్తాం’ అని చెప్పుకొచ్చింది. కోచ్ మజుందార్ మాట్లాడుతూ.. ‘ఆసియా కప్ ఫైనల్లో ఓటమి కారణాలను విశ్లేషించుకున్నాం.

10 రోజుల పాటు ఆటగాళ్లకు ఫిట్‌నెస్, ఫీల్డింగ్ విషయాల్లో ప్రత్యేక క్యాంప్ నిర్వహించాం. ఆటగాళ్లందరికి యోగా సెషన్స్‌తో పాటు సైకలాజికల్ క్లాసులు తీసుకున్నాం. మన జట్టులో టాప్ ఆరుగురు బెస్ట్ ప్రదర్శన చేసే అవకాశముంది’ అని చెప్పుకొచ్చాడు. 

అంతా మహిళలే.. 

ఈసారి మహిళల టీ20 ప్రపంచకప్‌కు మరో విశిష్టత ఉంది. మెగాటోర్నీలో అంపైరింగ్ నుంచి రిఫరీల వరకు అంతా మహిళలనే ఎంపిక చేయడం విశేషం. ఈసారి టోర్నీలో 10 మంది మహిళా అంపైర్లతో కూడిన బృందాన్ని, ముగ్గురు మ్యాచ్ రిఫరీలను ఐసీసీ నియమించింది.

భారత్‌కు చెందిన జీఎస్. లక్ష్మీ ఈ వరల్డ్‌కప్‌కు రిఫరీగా బాధ్యతలు నిర్వర్తిం చనున్నారు. లక్ష్మీది ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి పట్టణం. ఇక  పోలోసాక్‌కు గత నాలుగు మహిళా టీ20 వరల్డ్‌కప్‌లలో అంపైరింగ్ చేసిన అనుభవం ఉంది.