* సభాముఖంగా ఒప్పుకొన్న కేంద్రమంత్రి గడ్కరీ
* ప్రజల్లో పరివర్తనతోనే ప్రమాదాల నియంత్రణ సాధ్యమని వ్యాఖ్య
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళనను కలిగిస్తున్నాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కర్ పేర్కొన్నారు. కొన్నాళ్లుగా ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని, ప్రజల్లో పరివర్తన వచ్చినప్పుడే ప్రమాదాల నియంత్రణ సాధ్యమన్నారు. తాను విదేశాల్లో వివిధ మీటింగులకు హాజరైనప్పుడు రోడ్డు ప్రమాదాల అంశం చర్చకు వస్తే.. తలదించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ‘రోడ్డు ప్రమాదాల నివారణ’ అంశంపై ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన అనుబంధ ప్రశ్నకు లోక్‌సభలో గడ్కరీ సమాధానమిచ్చారు.
రోడ్డు రవాణా శాఖమంత్రిగా తాను ప్రమాణం చేసినప్పుడు కనీసం 50 శాతం ప్రమాదాలను కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదాలను తగ్గించడం అటుంచితే రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ విషయాన్ని సభాముఖంగా అంగీకరిస్తున్నానని చెప్పారు. భారతీయుల ప్రవర్తనలో మార్పు రావాలని, నిబంధనలను ప్రతిఒక్కరూ గౌరవించినప్పుడే ప్రమాదాల నియంత్రణ సాధ్యమవుతుందని చెప్పారు. ఏడాదిలో సగటున 1.78 లక్షల మంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని, వారిలో 60 శాతం 18 నుంచి 34 ఏండ్ల వయస్సు వాళ్లేనని గడ్కరీ పేర్కొన్నారు.