- ఎవరెన్ని కుట్రలు చేసినా పథకాలు ఆపం
సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు
డిప్యూటీ సీఎం భట్టి
జనగామ, జనవరి 5 (విజయక్రాంతి): కాంగ్రెస్ మాట ఇస్తే తప్పబోదని, ఇచ్చిన మాట ప్రకారం హామీలన్ని అమలుచేసి తీరుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం విశ్వనాథపురం గ్రామంలో రూ.8 కోట్ల 40 లక్షలతో నిర్మించనున్న మొగిలిచెర్ల, విశ్వనాథపురం, గొర్రెకుంట విద్యుత్ సబ్ స్టేషన్లకు ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో రాజీ పడటం లేదన్నారు. అనేక కుట్రలను అధిగమించి ఇప్పటికే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. గతంలో బీఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ధనిక రాష్ట్రంగా ఉన్నప్పటికీ రైతులకు రుణమాఫీ చేయలేకపోయిందన్నారు. నాడు కేసీఆర్ నిరుద్యోగులను విస్మరిస్తే... తాము అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 50 వేల ఉద్యోగాలిచ్చామని గుర్తు చేశారు.
రైతులకు, రైతు కూలీలకు భరోసా
సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకం అమలు చేయనున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పథకం కింద రైతుల ఖాతాలో ఏడాదికి రూ.12 వేలు జమ చేస్తామన్నారు. రైతులతో పాటు భూమి లేని రైతు కూలీలకు కూడా వర్తింపజేస్తామన్నారు.
కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కె.ఆర్.నాగరాజు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు.