calender_icon.png 2 October, 2024 | 12:02 PM

ఎంబీబీఎస్ సీట్లలో మనమే టాప్

04-09-2024 01:12:29 AM

  1. రాష్ట్రంలో 4 కొత్త మెడికల్ కాలేజీలకు పర్మిషన్ 
  2. మరో 4 కాలేజీల అనుమతుల కోసం ఎదురుచూపులు

హైదరాబాద్, సెప్టెంబర్ ౩ (విజయక్రాంతి): గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. అందులో భాగంగా జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో కాలేజీల ఏర్పాటుకు కసరత్తులు చేపట్టింది. వీటి లో ఇప్పటివరకు గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్ జిల్లాల్లో కాలేజీల ఏర్పాటు కు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతించింది. మిగిలిన 4 జిల్లాల్లో అనుమతుల కోసం  అధికారులు ఎదురుచూస్తున్నారు. కొత్త మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే 50 చొప్పున సీట్లకు కౌన్సెలింగ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.  కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతోప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఉండనుంది. 

 అగ్రిమెంట్ కోసం ఆగిన పర్మిషన్స్

యాదాద్రి భువనగిరి, మెదక్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీల అద్దె భవనాల రెంట్ అగ్రిమెంట్ 30 ఏళ్ల గడువుతో ఉం డాలని ఎన్‌ఎంసీ నిబంధన విధించింది.  తొలుత అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తు లో కేవలం రెండేళ్ల అగ్రిమెంట్ పత్రాలను అధికారులు పంపించారు. దీనికి తోడు ఫ్యాకల్టీ లోటు ఉండడంతో వీటికి అనుమతులను ఎన్‌ఎంసీ నిలిపేసింది. దీంతో ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు మరోసారి అనుమతులు కోరుతూ దరఖాస్తు పంపించారు. ఇటీవల ప్రొఫెసర్లు, అసి స్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేశారు.  ఈసారి కచ్చితంగా అనుమతులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. 

పెరగనున్న ఎంబీబీఎస్ సీట్లు..

రాష్ట్రంలో ప్రస్తుతం 28 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,915 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కొత్తగా 4 మెడికల్ కళాశాలల్లో 50 చొప్పున 200 సీట్లు పెరిగాయి. ఫలితంగా సీట్ల సంఖ్య 4,115కు చేరింది. మరో 4 కాలేజీలకు  అనుమతులు వచ్చే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో  మరో 200 సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 33, ప్రైవేటు రంగంలో 23 కళాశాలల్లో 8,515 మెడికల్ సీట్లున్నాయి.  దేశంలో ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. 

రెండో కౌన్సెలింగ్ నాటికి అనుమతులు 

ఎన్‌ఎంసీ అనుమతించిన గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్ జిల్లాల్లోని మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఒక్కో కళాశాలలో 50 ఎం బీబీఎస్ సీట్ల చొప్పున అడ్మిషన్లు ఉంటాయి. యాదాద్రి భువనగిరి, మెదక్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఏర్పా టు చేస్తున్న మెడికల్ కళాశాలల అద్దె భవనా ల రెంట్ అగ్రిమెంట్‌కు సంబంధించి ఎన్‌ఎం సీ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో మరోసారి నిబంధనల మేరకు దరఖాస్తు చేశాం. రెండో విడత కౌన్సెలింగ్ నాటికి అనుమతు లు వస్తాయని ఆశిస్తున్నాం. దీంతో మరో 4 కళాశాలల్లోనూ అడ్మిషన్లకు అవకాశం లభిస్తుంది.

 డాక్టర్ వాణి, 

రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు