calender_icon.png 24 December, 2024 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్సిడీల్లో మనమే టాప్!

24-12-2024 01:26:44 AM

  1. సంక్షేమానికి పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపు
  2. 2023-24లో రూ.12,500.6 కోట్లు
  3. 2024-25లో రూ.22,629.2 కోట్లు
  4. గతేడాదితో పోలిస్తే 81శాతం పెంపు.. ఆర్బీఐ నివేదిక

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. పథకాలకు కాంగ్రెస్ సర్కారు భారీగా నిధు లను వెచ్చిస్తోంది. దేశంలోనే సబ్సిడీ కోసం ఎక్కువ మొత్తంలో నిధులను వెచ్చిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఎనిమిదో స్థానంలో ఉన్నట్టు రిజర్వ బ్యాం కు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక పేర్కొంది.

2024-25 బడ్జెట్‌లో ప్రభు త్వం సబ్సిడీ కోసం రూ.22,629.2 కోట్లను ప్రతిపాదించింది. గతేడాది బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.12,500.6 కోట్లును సబ్సిడీ కోసం కేటాయించింది. గతేడాది కంటే ఈసారి ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో భాగంగా ఇచ్చే సబ్సిడీ కోసం కేటాయించిన నిధులు 81శాతం పెరిగినట్టు నివేదిక వెల్లడించింది.

దేశంలో అత్యధికంగా ఈ క్యాటగిరిలో నిధులను ఖర్చు పెడుతున్న టాప్-10 రాష్ట్రాల్లో నిధుల వృద్ధిలో తెలంగాణ టాప్‌లో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలోని రాష్ట్రాల బడ్జెట్ పత్రాల ఆధారంగా సబ్సిడీ కోసం ఆయా రాష్ట్రాలు ఎంత మేరకు పద్దులో కేటాయించాయో ఆర్బీఐ తన గణాంకాల్లో పేర్కొంది.

2024 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యధికంగా సబ్సిడీ కోసం నిధులను కేటాయించిన రాష్ట్రాల్లో రూ.1.46 లక్షల కోట్లతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. రూ.49 కోట్లతో రెండో స్థానంలో బీహార్, రూ.47 వేల కోట్లతో కర్ణాటక మూడో స్థానంలో ఉంది.

పెరిగిన పథకాలు, నిధులు 

తెలంగాణలో గతేడాది డిసెంబర్7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సంక్షేమ పథాకాలను ప్రకటించింది. ఏడాదికాలంగా సంక్షేమ పథకాల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వ్యవసాయ విద్యుత్, బడుల్లో సబ్సిడీకి కింద ఉచిత కరెంట్, బియ్యం సబ్సిడీ, వ్యవసాయంలో యాంత్రీకరణ, పామాయిల్ సాగు, అగ్రోస్ ద్వారా ఎరువులు..

ఇలా పలు అంశాల్లో ప్రభుత్వం సబ్సిడీలను ప్రకటించి ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం అమలుచేసిన రుణమాఫీని కూడా ఆర్‌ర్బీఐ తన నివేదికలో సబ్సిడీ అంశంగా పరిగణించింది. బీఆర్‌ఎస్ హయాంలో కన్నా సబ్సిడీ పథకాలు రెట్టింపు కావడంతో ప్రభుత్వం కూడా వాటికి బడ్జెట్‌లో వెచ్చించాల్సి వచ్చింది.

వ్యవసాయానికి అగ్రతాంబూళం

కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులను కేటాయించడంతోనే సరిపెట్టలేదు. ఆ నిధులను సబ్సిడీ కింద ఖర్చుచేసింది. ఆర్బీఐ రుణమాఫీని కూడా సబ్సిడీగా పరిగణించింది. ఈ క్రమంలో దీనికోసం ప్రభుత్వం ఏకంగా రూ.21వేల కోట్లను చెల్లించింది. విద్యుత్ సబ్సిడీ కోసమే రూ.11వేలు ఖర్చు చేసింది.

గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం రూ.1,234 కోట్ల సబ్సిడీ సొమ్మును ప్రభుత్వం డిస్కంలకు చెల్లించింది. అలాగే బియ్యం సబ్సిడీ కింద ప్రభుత్వం రూ.1,647 కోట్లను ఖర్చు చేసినట్టు విజయోత్సవాల సందర్భంగా ప్రకటించింది. గతేడాది ౪ నెలల సబ్సిడీ నిధులను కలుపుకొని ప్రభుత్వం వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. మహాలక్ష్మి పథకంలో భాగంగా జీరో టికెట్లపై ప్రభుత్వం ప్రతినెలా ఆర్టీసీకి రూ.270 కోట్లను సబ్సిడీ రూపంలో చెల్లిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఈ స్కీమ్ కింద దాదాపు రూ.12౦౦ కోట్లను ఆర్టీసీకి చెల్లించింది.

ఇవే కాకుండా ఎరువులు, యంత్ర పరికరాలకు ఇచ్చే సబ్సిడీతో పాటు ఇతర అంశాల్లో ప్రభుత్వం భారీగా నిధులను వెచ్చిస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే బడ్జెట్‌లో ప్రతిపాదించిన సొమ్ము కంటే.. ఏడాది తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉంది.  

ప్రభుత్వాలపై ఆర్థిక ఒత్తిడి 

దేశంలోని రాష్ట్రాలు సబ్సిడీ కోసం వెచ్చిస్తున్న నిధులపై ఆర్బీఐ తన నివేదికలో కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సబ్సిడీలతో ప్రభుత్వాలు ఆర్థిక ఒత్తిళ్లకు గురవుతున్నట్టు పేర్కొంది. సబ్సిడీలు అనేవి ప్రభుత్వాల దగ్గర ఉన్న ఆర్థిక వనరులను క్షీణింపజేస్తున్నాయని అభిప్రాయపడింది.

సబ్సిడీ రూపంలో రాష్ట్రాలు విద్యుత్, నగదు బదిలీ, రవాణా, వ్యవసాయం, రుణాల మాఫీ వంటి అంశాలకు ఎక్కు వ ఖర్చు చేస్తున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. ఇదే సమయంలో ద్రవ్యలోటు విషయంలో ఆర్బీ రాష్ట్రాలను ప్రశంసించింది. 2022-24 మధ్య కాలంలో ద్రవ్యలోటును 3 శాతంలోపు ఉంచడంపై హర్షం వ్యక్తం చేసింది. 

సబ్సిడీ కోసం అత్యధికంగా నిధులు వెచ్చిస్తున్న 

టాప్-10 రాష్ట్రాలు (కోట్లలో)

రాష్ట్రం 2023-24 2024-25

తమిళనాడు 1,38,171.5 1,46,908.2

ఛత్తీస్‌గఢ్ 58,257.2 49,430.6

కర్ణాటక 41,881.0 47,400.0

మధ్యప్రదేశ్ 36,330.2 34,214.3

గుజరాత్ 28,003.0 31,330.0

రాజస్థాన్ 31,450.4 30,181.5

ఉత్తరప్రదేశ్ 29,577.8 28,000.1

తెలంగాణ 12,500.6 22,629.2

పంజాబ్ 20,852.9 21,141.1

పశ్చిమబెంగాల్ 14,314.6 12,404.3