calender_icon.png 4 January, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖర్చులో మనమే టాప్!

01-01-2025 01:41:12 AM

  1. తెలంగాణ అర్బన్‌లో ఒక కుటుంబం నెలఖర్చు రూ.9వేలు
  2. పల్లెల్లో రూ.5,675.. దేశంలో నాలుగో స్థానం 
  3. ఖర్చులో దక్షిణాది రాష్ట్రాలు ముందంజ 
  4. వ్యయం పెరుగుదలకు కారణం నిత్యావసర ధరలే 
  5. 2023 నివేదికలో కేంద్ర గణాంకాలశాఖ వెల్లడి 
  6. 2.61లక్షల కుటుంబాల నుంచి వివరాల సేకరణ

హైదరాబాద్, డిసెంబర్ 3౧ (విజయక్రాంతి): బేవరేజ్, ప్రాసెస్‌డ్ ఫుడ్, పాల ఉత్పత్తులు, కూరగాయలు, గుడ్లు, మాం సం, ధాన్యాలు, పండ్ల ధరలు భారీగా పెరగడంతో.. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల ఖర్చు గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగినట్లు కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది.

దేశంలోని పట్టణ కుటుంబాల నెలవారీ తలసరి వ్యయంలో తెలం గాణ టాప్‌లో నిలిచినట్టు స్పష్టం చేసింది. అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తమ కుటుంబాల కోసం నెలకు సగటున రూ.9,131 ఖర్చు చేసినట్టు వెల్లడించింది. ఈ క్యాటగిరిలో జాతీయ సగటు ఖర్చు రూ.7,078గా ఉండగా.. తెలంగాణలోని పట్టణవాసులు 29శాతం ఎక్కువు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

2023 ఆగస్టు నుంచి 2024 జూలై వరకు దేశంలోని గ్రామాలు, పట్టణాల్లోని కుటుంబాలు సగటున ఎంత ఖర్చు చేశాయనే దానిపై కేంద్ర గణాంకాల శాఖ సర్వే చేపట్టింది. ఆ నివేదిక వివరాలను తాజాగా వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో కేరళ రూ. 6,673తో మొదటిస్థానంలో ఉండగా.. తెలంగాణ రూ.5,675తో నాలుగోస్థానం లో నిలిచింది.

ఈ క్యాటగిరీలో జాతీయ సగటు వ్యయం రూ.4,247 ఉండగా.. మన రాష్ట్ర పల్లెల్లోని కుటుంబాలు 33.62 శాతం ఎక్కువ ఖర్చు పెడుతున్నాయని సర్వే తెలిపింది. జాబితాను గణాంక శాఖ రెండు విభాగాలుగా తయారు చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ఒకటి.. 18 మేజర్ రాష్ట్రాలతో కలిపి మరోటి రూపొందించింది. మేజర్ రాష్ట్రా ల జాబితాలో అసోంను చేర్చారు.

ఇందు లో దక్షిణాది స్టేట్స్ ఖర్చులో ముందంజలో ఉన్నాయి. పల్లెలు, పట్టణాల్లో కుటుంబాల నెలవారీ తలసరి వ్యయం అత్యల్పంగా ఉన్న రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ ఉన్నట్టు సర్వే వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో అర్బన్ రూ.5,114, గ్రామాల్లో రూ.2,927 ఖర్చు చేశారు.

ఈ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ రూరల్‌లో 51.57 శాతం, అర్బన్‌లో 56 శాతం అధికంగా వెచ్చించినట్టు సర్వే వెల్లడించింది. కాగా.. దేశంలోని 2,61,953 ఇళ్లను గణాంక శాఖ సర్వే చేసి ఈ నివేదికను తయారు చేసింది. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు చెందిన కుటుంబాలు 1,54,357 కాగా.. పట్టణ ప్రాంతాలకు చెందిన ఇళ్లు 1,07,596. 

వారి ఖర్చు మాత్రం తగ్గింది..

గ్రామాలు, పట్టణాల్లోని కుటుంబాలను 12 క్యాటగిరీలుగా గణాంకాల శాఖ సర్వే చేసింది. 2022 పోలిస్తే.. 2023 లో 95శాతం కుటుంబాల ఖర్చు పెరిగింది. పట్టణాల్లో అత్యధికంగా రూ.20వేలు ఖర్చు చేసే కుటుంబాలు, అత్యల్పంగా రూ.2వేలు ఖర్చు చేసే కుటుంబాలను సర్వే చేశారు. అలాగే, గ్రామాల్లో అత్యధికంగా రూ.10 వేలు, అత్యల్పంగా రూ.1,300 ఖర్చు చేసే కుటుంబాలను పరిగణలోకి తీసుకున్నారు. అటు రూరల్, ఇటు పట్టణాల్లో అత్యధికంగా ఖర్చు చేసే ఐదు శాతం కుటుంబాల ఖర్చు మాత్రం తగ్గింది. 

ధరలు పట్టణాల్లోనే ఎక్కువగా పెరిగాయ్..

2022 పోలిస్తే.. 2023 నిత్యావసర ధరలు గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే ఎక్కువగా పెరిగినట్టు సర్వే తెలిపింది. పట్టణాల్లో ఒక కుటుంబం సగటున రూ.9,131 ఖర్చు చేయగా.. అందులో 11.09 శాతం బేవరేజ్, ప్రాసెస్‌డ్ ఫుడ్‌కు ఖర్చు చేసింది. అయితే గతేడాది 10.64 శాతం మాత్రమే వెచ్చించింది. పాల ఉత్పత్తులు పట్టణాల్లో గతేడాదితో పోలిస్తే ఈసారి పెరగగా.. పల్లెల్లో మాత్రం తగ్గాయి. గుడ్డు, ఫిష్, మాంసం ధరలు కూడా పల్లెలు, పట్టణాల్లో గతేడాదితో పోలిస్తే 2023 స్వల్ప వ్యత్యాసం ఉంది.

దక్షిణాది రాష్ట్రాలే ముందంజ

పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన మహారాష్ట్ర, గుజరాత్.. అత్యధిక జనాభా కలిగిన యూపీ, బిహార్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు కూడా దక్షిణాదితో పోలిస్తే ఖర్చులో వెనుకంజలో ఉన్నాయి. అర్బన్ క్యాటగిరీలో ఏపీలో నెలవారీ తలసరి వ్యయం రూ.7341 ఉండగా, గుజరాత్‌లో రూ.7,198 మాత్రమే ఉంది.

మహారాష్ట్రలో అర్బన్‌లో ఖర్చు రూ.7415 గా ఉంది. రూరల్ విషయానికొస్తే.. ఈ జాబితాలోనూ సౌత్ స్టేట్స్‌లో ఖర్చు ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కేరళ మొదటి, తమిళనాడు మూడు, తెలంగాణ నాలుగు, ఏపీ ఐదు, కర్ణాటక ఏడో స్థానంలో ఉన్నాయి. 

ఆహారేతర వస్తువుల ఖర్చే ఎక్కువ..  

పల్లెలు, పట్టణాల్లో ఆహార వస్తువుల కంటే ఆహారేతర వస్తువులకే ఎక్కువ ఖర్చు చేసినట్టు నివేదికలో వెల్లడైంది. అందులో పాదరక్షలు, దుస్తులు, వినోదం, సేవలకు ఎక్కువ ఖర్చు పెట్టినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో పట్టణాలు, గ్రామాలకు కొన్ని తేడాలే ఉన్నాయి. గ్రామాల్లో విద్యపై పెట్టిన వ్యయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈసారి తగ్గగా.. పట్టణాల్లో పెరిగింది. ఆరోగ్యంపై రెండు ప్రాంతాల్లోనూ వ్యయం తగ్గింది.