calender_icon.png 30 September, 2024 | 9:08 AM

ఐటీ వృద్ధిలో మనమే బెస్ట్

30-09-2024 02:26:47 AM

దేశానికే ఆదర్శం

  1. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 11.2 శాతం వృద్ధిరేటు
  2. జాతీయ సగటు వృద్ధితో పోలిస్తే 3.3 శాతం అధికం
  3. 4.5 శాతం మేర పెరిగిన ఉద్యోగ అవకాశాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయ క్రాంతి) : తెలంగాణ ఏర్పాటైన పదేళ్లలోనే రాష్ట్రంలో ఐటీ రంగం దూసుకెళ్తు న్నది. గత పదేళ్లుగా రాష్ట్రంలో ఐటీ రంగం గణనీయమైన అభివృద్ధిని కనబర్చింది. లక్షల మందికి ఉపాధి కల్పిస్తుం డటంతోపాటు ఎగుమతుల్లో కూడా అద్భుతమైన వృద్ధి సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ దిగ్గజ కంపెనీల ఏర్పాటుకు గమ్యస్థానంగా నిలుస్తున్నది. ఐటీ రంగాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఐటీ ఎగుమతుల్లో  2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 2,68,233 కోట్ల ఎగుమతులకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలి స్తే తెలంగాణ     

ఐటీ రంగం 11.2 శాతం అధికంగా వృద్ధిరేటును సాధించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఎగుమతులు రూ. 66,276 కోట్లుగా ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ ఐటీ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. అయితే ఐటీ ఎగుమతుల విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశాన్ని కూడా వెనక్కు నెట్టింది. 11.2 శాతంగా రాష్ట్ర ఐటీ వృద్ధిరేటు జాతీయ సగటు వృద్ధి కంటే 3.3 శాతం ఎక్కువ కావడం విశేషం. 

ఊతమిచ్చేలా ఉపాధి కల్పన..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఉద్యోగ, ఉపాధి కల్పనలో తెలంగాణ ఐటీ రంగం కీలకంగా వ్యవహరిస్తుంది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ అండగా నిలుస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటీ రంగానికి సంబంధించి 9.46 లక్షల మందికి ఉపాధి లభించింది.

కేవలం ఒక ఆర్థిక సంవత్సరంలోనే 40 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు లభించాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఐటీ రంగంలో ఉపాధికి సంబంధించి 4.5 శాతం వృద్ధి సాధించింది. 2014-15 సంవత్సరంలో ఐటీ రంగం లో 3,71,774 మంది పనిచేశారు. ఉపాధి కల్పన ప్రతియేటా గణనీయంగా పెరుగుతూ వస్తుంది. పదేళ్లలో ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు దాదాపు మూడు రెట్లు పెరిగాయి.

25 వృద్ధే లక్ష్యం..

ప్రస్తుతం 11 శాతంగా ఉన్న రాష్ట్ర ఐటీ రంగం వృద్ధిని 25 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఏఐ సిటీ ఆవిర్భావం ప్రపంచంలోనే హైదరాబాద్ ఏఐ హబ్‌గా రూపొందేలా చర్యలు తీసుకుంటున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో లక్షలాది మంది కోడింగ్ ఇంజినీర్లుగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదాన్ని ముందే గుర్తించిన ప్రభుత్వం ఏఐ సిటీ ఏర్పాటుతో ఆ సమస్యకు పరిష్కారం చూపనున్నది.

రాబోయే రోజుల్లో 2 లక్షల మంది యువతను ఏఐ ఇంజినీర్లుగా నైపుణ్యంగా పొందనున్నారు. తద్వారా ఐటీ రంగంలో అద్భుతమైన ఉపాధి కల్పనతోపాటు ఐటీ ఉత్పత్తులు, ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని సాధించేందుకు అవకాశం లభిస్తుంది. 

ఏడాదివారీగా ఉద్యోగాలు

సంవత్సరం               ఉద్యోగాలు

2014-15               3,71,774

2015-16               4,07,385

2016-17               4,31,891

2017-18               4,75,308

2018-19               5,43,033

2019-20               5,82,126

2020-21               6,28,615

2021-22               7,78,121

2022-23               9,05,715

2023-24               9,46,000

ఏడాదివారీగా ఎగుమతులు

సంవత్సరం               ఎగుమతులు

(కోట్లలో)

2014-15                66,276

2015-16                75,070

2016-17                85,470

2017-18                93,442

2018-19                1,09,219

2019-20                1,28,807

2020-21                1,45,552

2021-22                1,83,569

2022-23                2,41,275

2023-24                2,68,233