calender_icon.png 7 January, 2025 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిక్కుముడులు విప్పుతూ ఉద్యోగాలిస్తున్నాం

06-01-2025 01:18:15 AM

ఒక్క ఏడాదిలోనే 55,143 కొలువులిచ్చాం

  1. ఉద్యోగాలివ్వడంలో తెలంగాణ దేశానికే ఆదర్శం 
  2. యువత భవిత కోసమే మా ప్రభుత్వ ఆలోచన 
  3. సమైక్య పాలన కంటే బీఆర్‌ఎస్ హయాంలోనే నిరుద్యోగులకు తీరని అన్యాయం 
  4. సివిల్స్‌లో ఎంపికై రాష్ట్రం పేరు నిలబెట్టాలి 
  5. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు
  6. 2౦ మందికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ

హైదరాబాద్, జనవరి 5(విజయక్రాంతి): ప్రతిపక్షాలు సృష్టించిన అడ్డంకులను తొలగించి, ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకొంటూ వివిధ హోదాల్లో ఉద్యోగాలను తమ ప్రభుత్వం భర్తీ చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టంచేశా రు. గత పాలకులు గ్రూప్-1 పరీక్షలను అడ్డుకోవాలని విద్యార్థులను రెచ్చగొట్టి వీధుల్లోకి తీసు కొచ్చారని గుర్తుచేశారు.

పరీక్షలు నిర్వహించకుం డా కాలయాపన చేయాలన్న కుట్ర చేస్తే.. కోర్టుల సహకారంతో తాము ఉద్యోగాలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఆదివారం ప్రజాభవన్‌లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన హాజరయ్యారు.

సింగరేణి సౌజన్యంతో మెయిన్స్‌కు ఎంపికైన 20 మంది అభ్య ర్థులకు ఒక్కొకరికి రూ.లక్ష చొప్పున చెక్కులను సీఎం అందజేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కంటే స్వరాష్ట్రంలోనే ఎక్కువ అన్యాయం జరిగిందని ఆరోపించారు.

గత బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో పదేళ్ల పాటు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చెపట్టలేదని మండిపడ్డారు. దీంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని వాపోయారు. అలాంటి సమయంలో యువత, నిరుద్యోగాల ప్రోత్సాహంతో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అప్పటివరకు ప్రగతి భవన్‌గా పిలుబడే ఈ ప్రాంగణాన్ని ప్రజాభవన్‌గా మార్చినట్టు చెప్పారు.

భారత-పాక్ సరిహద్దుల్లో ఎలాంటి ముళ్ల కంచెలు ఉంటాయో.. ప్రగతిభవన్ చుట్టూ అలాగే ముంళ్ల కంచెలు ఉండేవని గుర్తుచేశారు. గతేడాది డిసెంబర్ 7న తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని తొలగించినట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలివ్వడంతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచినట్లు పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం ఆలోచించేది యువత భవిష్యత్ కోసమే అని, అందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. 

కష్టంతో పాటు కమిట్మెంట్ అవసరం

సివిల్స్‌లో తెలంగాణ నుంచి ఎక్కువ మంది రాణించాలని రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ప్రస్తుతం బీహార్ నుంచి ఎక్కువ మంది సివిల్స్‌లో  రాణిస్తున్నారని చెప్పారు. మన రాష్ట్రం నుంచీ ఎక్కు వ సంఖ్యలో సివిల్స్‌లో రాణించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పేర్కొన్నారు. అందులో భాగంగానే రాజీవ్ సివిల్స్ అభయహస్తం ద్వారా రూ.లక్ష అందిస్తున్నామని పేర్కొన్నారు.

అయితే అభ్యర్థులు దీన్ని ఆర్థిక సాయంగా భావించొద్దని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంగా పరిగణించాలని కోరారు. కష్టంతోపాటు కమిట్మెంట్ ఉంటేనే విజయం వరిస్తుందని పేర్కొన్నారు. ఇంటర్వ్యూకు వెళ్లే ప్రతీ ఒక్కరూ సివిల్స్‌లో సెలెక్ట్ అవ్వాలని ఆకాంక్షించారు. 

14 ఏళ్లు గ్రూప్-1 నిర్వహించలేదు 

దేశంలోనే తెలంగాణ నుంచి అత్యధికంగా సివిల్స్‌లో ఎంపికవుతారని గర్వంగా చెప్పుకొనే స్థాయికి రాష్ర్టం చేరుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. జాబ్ క్యాలెండర్‌లో చెప్పిన విధంగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం మార్చి 31లోగా 563 గ్రూప్--1 ఉద్యోగాల నియామకాలను పూర్తిచేయబోతున్నదని చెప్పారు.

గత 14 ఏళ్లుగా గ్రూప్-1 పరీక్షలను నిర్వహించలేదని అన్నారు. ఎన్నో అడ్డంకులు, కుట్రలను అధిగమించి తాము ఈ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను అన్నివిధాలుగా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

మెయిన్స్‌కు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ఢిల్లీకి వెళ్లనప్పుడు అక్కడ ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సింగరేణి సీఎండీ బలరాం, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. 

ఆ ప్రాంతాల్లో సోలార్ పవర్ ఉత్పత్తి

సింగరేణిలో గనులు తవ్వి వదిలివేసిన ప్రాంతాలు, ఖాళీగా ఉన్న స్థలాల్లో సోలార్, పంపు స్టోరేజ్ వంటి పద్ధతుల్లో గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తామని భట్టి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ పవర్ వినియోగం పెరగనున్న నేపథ్యంలో బొగ్గు గనులు మూతపడే అవకాశం ఉందని, ఈ క్రమంలో ముందుచూపుతో సింగరేణిని మైనింగ్ రంగాల్లో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పారు.

మైనింగ్‌లో వందేళ్ల అనుభవం సింగరేణిని లిథియం, గ్రాఫైట్ వంటి గనుల తవ్వకాల వైపు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. దీని కోసం దేశవ్యాప్తంగా నిపుణులను ఆహ్వానించి వారి సలహాలు సూచనలు మేరకు ముందుకుపోవాలని ఆలోచిస్తున్నట్లు భట్టి వెల్లడించారు.

సింగరేణిని మేటి సంస్థగా నిలబెడుతాం: భట్టి

గత పాలకులు సింగరేణిని వ్యక్తిగత, రాజకీయ అవసరాల కోసం వినియోగించు కున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. తాము మాత్రం సింగరేణిని ప్రపంచంలోనే మేటి సంస్థగా నిలబెడుతామని, దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు. సింగరేణిని ప్రపంచస్థాయిలో ప్రసిద్ధ సంస్థగా నిలబెట్టాలన్నదే తమ ఆలోచన అన్నారు.

ఇది రాష్ర్ట ప్రభుత్వానికే ఆర్థికంగా బలమైన ఆర్గనైజేషన్ అని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. ఉద్యోగుల పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్న తమ ప్రభుత్వం సింగరేణి పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో 200 కోట్లకు తగ్గకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల లు నిర్మిస్తున్నట్టు స్పష్టంచేశారు.

ఏ రాష్ర్టంలో లేని విధంగా సివిల్స్ వైపు రాష్ర్ట యువతను మళ్లించేందుకు ప్రభుత్వం సింగరేణి సౌజన్యంతో సివిల్స్ అభయహస్తం కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి ఆర్థిక సాయం అందించడం గర్వకారణంగా భావిస్తున్నట్లు చెప్పారు.