03-03-2025 05:43:46 PM
తెలంగాణ ఉత్తర విద్యుత్ సంస్థ కామారెడ్డి ఎస్ ఈ శ్రావణ్ కుమార్...
కామారెడ్డి (విజయక్రాంతి): వినియోగదారులందరికి మరింత చేరువై వారికి వినూత్న సేవలు అందిస్తున్నామని ఇందులో భాగంగా ''విద్యుత్ ప్రజావాణి'' కార్యక్రమం చేపట్టామని తెలంగాణ ఉత్తర విద్యుత్ సంస్థ కామారెడ్డి సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ ఎన్.శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఎస్ఈ కార్యాలయంలో మాట్లాడారు. వినియోగదారుల ఫిర్యాదులను తీసుకొని వాటిని సకాలంలో పరిష్కరించేందుకు ప్రతి సోమవారం "విద్యుత్ ప్రజావాణి" నిర్వహించనున్నట్లు తెలిపారు. 2024 జూన్ 17న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కరించడానికి అన్ని సర్కిల్, డివిజన్, సెక్షన్ ఆఫీస్ లలో అమలు చేస్తున్నామని తెలిపారు.
వినియోగదారుల విద్యుత్ సమస్యలు ప్రధానంగా విద్యుత్ బిల్లుల సమస్యలు, మీటర్ల సమస్యలు, విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు, క్యాటగిరి మార్పు, పేరు మార్పు ప్రధమభరింతగా ఉన్న స్థంబాలు తదితర విద్యుత్ ఫిర్యాదుల సమస్య తీవ్రతను బట్టి అప్పటికప్పుడే లేదా సమయం తీసుకొని పరిష్కరించడానికి దోహదపడుతుందని తెలిపారు. అలాగే వారితో సత్ సంబంధాలు మరింత మెరుగుపడుతాయని అన్నారు. ఇప్పటి వరకు "విద్యుత్ ప్రజావాణి"లో 444 ఫిర్యాదులు రాగా, 400 పరిష్కరించామని తెలిపారు. ఇట్టి కార్యక్రమాన్ని విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం కొరకు సర్కిల్ పరిధిలోని అన్ని ముఖ్య కార్యాలయాల్లో అనగా సర్కిల్ ఆఫీస్, డివిజన్ ఆఫీస్, ఈఆర్వో, సబ్ డివిజన్ ఆఫీస్, సెక్షన్ ఆఫీస్ లలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
డివిజన్ ఆఫీస్, ఈఆర్వో, సబ్ డివిజన్ ఆఫీస్, సెక్షన్ ఆఫీస్ లలో "ప్రతి సోమవారం "ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు, సర్కిల్ ఆఫీస్ లో అదే రోజు సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. విద్యుత్ ప్రజావాణి కార్యక్రమన్ని పటిష్ట పరచడంలో భాగంగా సమీక్షలు నిర్వహించి విద్యుత్ వినియోగదారులు చేసే ఫిర్యాదులను సకాలంలో పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. "విద్యుత్ ప్రజావాణి" వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందని ఆయన తెలిపారు.