17-03-2025 01:32:21 AM
కేసీఆర్ మీరు సిద్ధమా.. లక్షల్లో జీతం తీసుకుంటూ ఫాంహౌస్‌లో విశ్రాంతి తగునా?
జనగామ, మార్చి 16 (విజయక్రాంతి): ‘ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫాం హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. ప్రాజెక్టులపై మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతున్నరు. పిల్లకాకులతో నాకెందుకు? కేసీఆర్ దమ్ముంటే మీరు బయటకు రండి.. ఏ ప్రాజెక్టుపై చర్చించేందుకైనా మేం సిద్ధం. మీరు సిద్ధమా?’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.
నెలకు లక్షల్లో జీతం తీసుకుని ఫాంహౌస్‌లో కూర్చుంటున్నారని విమర్శించారు. ‘అధికారం ఉంటేనే ప్రజల్లో ఉంటా.. లేదంటే ఫాంహౌజ్‌లో పడుకుంటా..’ అన్నట్టుగా కేసీఆర్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రాన్ని ప్రజలకు బీఆర్‌ఎస్ చేతిలో పెడితే కేసీఆర్ కుటుంబం అందిన కాడికి దోచుకుని, రాష్ట్రానికి అప్పులు మాత్రమే మిగిల్చిందని ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆదివారం సీఎం రూ.800 కోట్లతో చేపట్టనున్న అనేక అభివృద్ధి పనులకు ఆయన వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
అనంతరం మహిళా స్వయం శక్తి సంఘాలకు 7 ఎలక్ట్రికల్ బస్సులను అప్పగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కల్పిస్తే మొహం చెల్లక బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌజ్‌లో పడుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ అనుభవాన్ని, విజ్ఞానాన్ని తెలంగాణ ప్రజల కోసం ఎందుకు వాడడం లేదని నిలదీశారు. పదేళ్ల పాటు గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పుడు తమ ప్రభుత్వం నెలకు రూ.6,500 కోట్ల చొప్పున మిత్తి కట్టాల్సి వస్తోందని వాపోయారు.
పంటలకు ఉచిత కరెంటు ఇస్తున్నామన్న వంకతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ.40 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టిందని తెలిపారు. విద్యుత్ శాఖ, సింగరేణికి కూడా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటికి మిత్తిగా బ్యాంకులకు రూ.1.53 లక్షల కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్‌లో ఉన్నా తాము సంక్షేమంలో మాత్రం వెనకడుగు వేయడం లేదని వివరించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్నామని వెల్లడించారు. ఓర్వలేని బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వంపై నిత్యం బురద జల్లుతున్నారని మండిపడ్డారు.
అవరోధాలు అధిగమించి అభివృద్ధి..
ఎన్ని అవరోధాలు ఎదురైనా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని, ఆ ఆదాయాన్ని తిరిగి పేదలకు పంచుతామని సీఎం అన్నారు. 14 నెలల పాలనలో ఇప్పటికే రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదల ఇండ్లకు ఉచిత కరెంటు, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, 25 లక్షల మందికి పైగా రైతులకు రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశామని గుర్తుచేశారు. రైతుభరోసా ద్వారా రైతుల ఖాతాల్లో రూ.7,620 కోట్లు జమ చేశామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 55 వేలకు పైగా పభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు.
అది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం..
నాటి కేసీఆర్ సాగునీటి కోసం రూ.లక్షా 81 వేల కోట్లు ఖర్చు చేశారని, వాటిలో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే రూ.లక్ష కోట్లు వెచ్చించారని గుర్తుచేశారు. అంత భారీగా ఖర్చు చేసినా ఆ ప్రాజెక్టు మూడేళ్లలోనే కట్టుడు అయింది.. కూలుడూ పూర్తయిందని ఎద్దేవా చేశారు.
కూలిన ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలంటే మళ్లీ రూ.వేల కోట్లు ఖర్చయ్యే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. నిజానికి అది కాళేశ్వరం కాదని, కూలేశ్వరం ప్రాజెక్టు అని అభివర్ణించారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన జూరాల, బీమా, నెట్టంపాడు, కోయల్‌సాగర్, దేవాదుల, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ తదితర ప్రాజెక్టులే ఇప్పుడు తెలంగాణను సస్యశ్యామలం చేశాయని, కాళేశ్వరంతో రైతులకు ఒరిగిందేమీ లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌ను తలదన్నేలా వరంగల్..
హైదరాబాద్‌తో పోటీ పడేలా వరంగల్‌ను అభివృద్ధి చేస్తానని సీఎం హమీ ఇచ్చారు. దీనిలో భాగంగానే ఇప్పటికే వరంగల్ నగర అభివృద్ధికి రూ.6,500 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ నారాయణరావు వంటి ఉద్యమ నేతలు పుట్టిన ఈ ప్రాంతమంటే తనకెంతో అభిమానమని వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమంలో వరంగల్ కీలకపాత్ర పోషించిందని కొనియాడారు. తాను ఎంపీ ఎలక్షన్ల సమయంలో కడియం కావ్యను గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని మాటిచ్చానని, అన్నట్టుగానే మామునూరు ఎయిర్‌పోర్టుకు మార్గం సుగమం చేసి ఇక్కడికి వచ్చానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వరంగల్‌కు ఔటర్ రింగురోడ్డు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వచ్చాయన్నారు.
పదేళ్లు నత్తనడకన సాగిన కాళోజీ కళాక్షేత్రం పనులను తాము యుద్ధప్రాతిపదికన పూర్తి చేసినట్లు తెలిపారు. మరోవైపు ఉమ్మడి వరంగల్‌లోని స్టేషన్‌ఘన్‌పూర్‌కు రూ.800 కోట్లు మంజూరు చేసి ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఇచ్చిన మాట నిలుపుకున్నానని సీఎం చెప్పారు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు వంద పడకల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేసి ఈ ప్రాంత అభివృద్ధిపై చిత్తశుద్ధిని చాటుకున్నామని వ్యాఖ్యానించారు.
అందరి సలహాలు తీసుకుంటూ రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని సరైన పద్ధతిలో వాడుతున్నామని, నాటి సీఎం కేసీఆర్‌లా అప్పులు చేసి పప్పు కూడు పెట్టే రీతిలో తాము వ్యవహరించబోమని సీఎం స్పష్టం చేశారు. సభలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినీడ్డి, కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అడిషనల్ కలెక్టర్లు పింకేశ్‌కుమార్, రోహిత్‌సింగ్, జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.