calender_icon.png 20 March, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరైన దారిలోనే ఉన్నాం..

20-03-2025 12:07:03 AM

ఉక్రెయిన్ కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ ప్రకటన..

జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..

యుద్ధాన్ని ముగించడానికి అమెరికాతో కలిసి పని చేస్తాం: జెలెన్‌స్కీ 

వాషింగ్టన్: ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన అంశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో జరిపిన ఫోన్ సంభాషణ చాలా బాగా జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. జెలెన్‌స్కీతో దాదాపు గంటపాటు ఫోన్‌లో మాట్లాడినట్టు తన సొంత సామాజిక మాద్యమం ట్రూత్ సోషల్ వేదికగా బుధవారం వెల్లడించారు. మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తాను జరిపిన చర్చలపైనే తాము ఎక్కువ సేపు మాట్లాడుకున్నట్టు స్పష్టం చేశారు. ఉక్రెయిన్, రష్యా శాంతి ఒప్పందానికి సంబంధించి ఇరు వర్గాల అభ్యర్థనలు, అవసరాలపై తమ చర్చలు జరిగినట్టు తెలిపారు.

శాంతి ఒప్పందానికి సంబంధించి సరైన దారిలోనే మందుకెళ్తున్నట్టు చెప్పారు. అలాగే చర్చలకు సంబంధించిన వివరాలను రూపొందించాలని విదేశాంగ మంత్రి మర్కా రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్‌ను ఆదేశించనున్నట్టు తెలిపారు. అతి త్వరలో వాళ్లు ఈ చర్చలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తారని పేర్కొన్నారు. కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ మంగళవారం 2 గంటలపాటు ఫోన్‌లో మంతనాలు జరిపారు. ఈ క్రమంలో 30 రోజులపాటు ఉక్రెయిన్‌పై దాడులు నిలిపివేయడానికి పుతిన్ అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌తో జెలెన్‌స్కీ ఫోన్‌లో సంభాషించారు. 

సానుకూలంగా సాగిన సంభాషణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్ సంభాషణ సానుకూలంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. యుద్ధానికి ముగింపు పలికి శాంతిని స్థాపించడం కోసం ఇరు దేశాలు కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అమెరికా నాయకత్వంలో ఈ ఏడాది శాంతి స్థాపన జరుగుతుందని తాము విశ్వసిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. ట్రంప్‌తో ఫోన్ సంభాషణకు ముందు కాల్పుల విరమణకు ఒప్పుకుని కూడా రష్యా తమపై దాడులు జరుపుతూనే ఉందని జెలెన్‌స్కీ ఆరోపించారు.