calender_icon.png 1 November, 2024 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేమే నంబర్ వన్

12-05-2024 12:57:48 AM

దక్షిణాదిలో బీజేపీకి అనుకూల వాతావరణం

తెలంగాణలో ఎక్కువ స్థానాల్లో తమదే విజయం

మిగులు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ సర్కారు స్టీరింగులు మజ్లిస్ చేతుల్లోనే

నాలుగో దశలోనూ మద్దతుగా నిలవాలని ఓటర్లకు విజ్ఞప్తి

కేంద్ర మంత్రి అమిత్ షా

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): తెలంగాణ, ఏపీ సహా దక్షిణాదిలో బీజేపీ నెంబర్ వన్‌గా నిలుస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 10కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని, 13 చోట్ల పరిస్థితి చాలా సంతృప్తికరంగా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ వైపు రూ.12లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన ఇండి కూటమి ఉంటే మరోవైపు 25పైసలు కూడా వెనకేసుకోని మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ఉందన్నారు.

తెలం గాణలో ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా హైదరాబాద్ హోటల్ కాకతీయలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. అధికార అహంకారం తలకెక్కిన ఇండి యా కూటమితో 23 ఏళ్లుగా సెలవు లేకుండా దీపావళిని కూడా సైనికుల మధ్యన జరుపుకుంటున్న మోదీతో కూటమి పోటీ పడుతోం దన్నారు. ఈ పదేళ్లలో దేశ అంతర్గత భద్రత, ఆర్థిక వ్యవస్థ పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి. డిజిటల్ ఇండియా, పెరిగిన స్టార్టప్‌లతో దేశం గణనీయమైన ప్రగతిని సాధించిందన్నా రు.

రాహుల్ గాంధీని ఎన్ని సార్లు లాంఛ్ చేసి నా కాంగ్రెస్ విజయవంతం కాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. 2014లో తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండేదని, కానీ పదేళ్లలో ప్రభుత్వాల తీరుతో అప్పుల కుప్పగా మారిపోయిందని అమిత్ షా ఆరోపించారు. ఇప్పు డు కాంగ్రెస్ సర్కార్ కూడా అప్పులు చేస్తోందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణకు వచ్చిన నిధుల కంటే ఈ పదేళ్లలో మోదీ సర్కారు ఎక్కువ నిధులను అందించిందన్నారు. అవినీతి, అక్రమాలు, కుటుంబ రాజకీయాలు తెలంగాణను భ్రష్టుపట్టించాయని మండిపడ్డారు. 

సర్కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో...

రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎవరు అధికారంలో ఉన్నా ప్రభుత్వాన్ని నడిపేది మాత్రం మజ్లిస్ పార్టీయేనని, సర్కారు స్టీరింగ్ వారి చేతుల్లోనే ఉంటుందని అమిత్ షా విమర్శించారు. తెలంగాణలో 4శాతం ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వడం ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాలరాయడమేనని అన్నారు. తాము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలులో విఫలమైందని, రూ.2 లక్షల రుణమాఫీని సోనియాగాంధీ జన్మదినం రోజు అమలు చేస్తామని అన్నారని, కానీ ఎన్నో పుట్టినరోజున చేస్తారో చెప్పలేదని ఎద్దేవా చేశారు.

రైతులకు రూ.15వేల రైతు భరోసా, ధాన్యానికి బోనస్ రూ.500, మహిళలకు రూ.2,500 లాంటి హామీలన్నీ అమలు చేయలేదు కానీ హైకమాండ్‌కు ఇచ్చిన హామీలను మాత్రం పూర్తి చేసుకున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల కోసం తెలంగాణ నుంచి వసూలు చేసి పంపిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్, కూటమి నాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. 

తన వీడియోను మార్ఫింగ్ చేసి..

తన వీడియోను మార్ఫింగ్ చేసి తాము రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నట్లుగా దుష్ప్రచారం చేశారని అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మతపరమైన రిజర్వేషన్లు అసాధ్యమని, ఇవి రాజ్యాంగ విరుద్ధమని, ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లను తొలగించి వారికి ఈడబ్ల్యూఎస్ ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, ఉత్తర దక్షిణాలుగా విభజన చేస్తోందని, ఇప్పటికే దేశాన్ని ఓసారి విడగొట్టారని, వారికి ఇది తప్ప ఏం తెలుసని విమర్శించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370, త్రిపుల్ తలాక్ రద్దు చేస్తామని, పర్సనల్ లాను వినియోగంలోకి తెస్తామని అంటున్నారని, ఇవి అవసరమా అని ప్రజలే ప్రశ్నిస్తున్నారన్నారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి పథంలో నిలపాలని మోదీ ప్రయత్నిస్తుంటే... దేశాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. మోదీ ఉంటేనే దేశం సూభిక్షంగా ఉంటుందని అన్నారు. 

మూడోసారి మోదీ ప్రధాని 

ఇప్పటివరకు జరిగిన మూడు దశల ఎన్నికల్లోలాగా నాలుగో దశలోనూ బీజేపీకి మద్దతుగా నిలవాలని ప్రజలకు అమిత్ షా విజ్ఞప్తి చేశారు. 400కు పైగా సీట్లను సాధించి మోదీ మరోసారి ప్రధాని అవుతారని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని అన్నారు. మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 5వ స్థానానికి వచ్చిందని, మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ధ్యేయమన్నారు. మాట ఇచ్చినట్లుగానే రామమందిర నిర్మాణం చేసి చూపించామని, మహిళలకు రిజర్వేషన్లు కల్పించామన్నారు.

సర్జికల్ స్ట్రుక్స్ చేసిన మూడో దేశంగా భారత్ నిలుస్తోందన్నారు. సరిహద్దుల, దేశ అంతర్గత విషయాల్లో చొరబడేందుకు ఎవరు ప్రయత్నించినా చూస్తూ ఊరుకోబోమని, వారి భూభాగంలోకి చొచ్చుకుని వెళ్లి మరీ దాడి చేస్తామని షా హెచ్చరించారు. అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వలేదని, కేవలం ఎన్నికల ప్రచారం కోసమే సమయం ఇచ్చిందని, బెయిల్ రావడమే క్లీన్‌చిట్ అనుకుంటే అంతకన్న అమాయకత్వం మరొకటి ఉండబోదన్నారు.

తెలంగాణకు పెట్టుబడులు రాకుండా కేంద్రం కుట్రలు చేస్తోందన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమని, రాష్ట్రాన్ని వారు నడుపుతున్న తీరును చూసి ఎవరూ రాష్ట్రానికి రావడం లేదని అన్నారు. అవసరమైతే నేరుగా ప్రధానిని కలిసి అడిగితే బాగుంటుందని, అనవసర విమర్శలు సరికాదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తదితరులు ఉన్నారు.