calender_icon.png 24 December, 2024 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేం వ్యతిరేకం కాదు

19-10-2024 02:16:21 AM

  1. మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలి
  2. డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించకుండా మూసీ సుందరీకరణ వీలు కాదు : కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి

ముషీరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): మూసీ సుందరీకరణను, పున రుజ్జీవన చర్యలను తాము వ్యతిరేకిండం లేదని, నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్‌ను నిర్మించి అభివృద్ధి చేయాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలోని 30 శాతం జనాభా హైదరాబాద్‌లోనే ఉంటున్నారని, డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించకుండా మూసీ సుందరీకరణ వీలు కాదని, ఇతర అభివృద్ధి పనులు కూడా ముందుకు సాగవన్నారు. సుందరీకరణ పేరుతో నదీ పరీవాహక ప్రాంతాల్లో 30, 40 ఏండ్లుగా జీవిస్తున్న పేదల ఇండ్లను కూల్చడం సరికాదన్నారు.

డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధ రించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. సనత్‌నగర్, ఖైరతాబాద్, గౌలిపూర వంటి అనేక ప్రాంతాల్లో రోడ్ల గుంతలను పూడ్చడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ లాంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలే కాదనేది ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు.

నగరంలో పౌర సౌకర్యాలు కల్పించేలా జీహెచ్‌ఎంసీ, మెట్రో, వాటర్ వర్క్స్‌కు నిధులు కేటాయించాలన్నారు. అరకొర నిధులను విడుదల చేయడంతో హైదరాబాద్ నగరంలో అనేక సమస్యలు ఉత్పన్నమవు తున్నాయన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేని కారణంగా అనేక ప్రాంతాలో మంచినీటి పైప్‌లైన్‌లలో మురుగునీరు కలుస్తుందని, దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. శుక్రవారం ముషీరాబాద్ నియోజక వర్గం గాంధీనగర్‌లోని ఆంద్రా కేఫ్ వద్ద రూ.54 లక్షల వ్యయంతో నూతన అంతర్గత డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణ పనులను ఆయన ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఏ పావని, డీఎంసీ ఖాదీర్‌లతో కలిసి ప్రారంభించారు.

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ, అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో ముషీరాబాద్ తహసీల్దార్ రాణాప్రతాప్ సింగ్, జీహెచ్‌ఎంసీ ఈఈ శ్రీనివాస్, ఏఎంహెచ్‌ఓ ప్రవీణ, జలమండలి డీజీఎం కార్తీక్‌రెడ్డి, మేనేజర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.