calender_icon.png 11 January, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యక్ష నరకంలో ఉన్నాం

30-07-2024 12:04:58 AM

  1. ఢిల్లీలో బతికేందుకు కనీస వసతులు కరువు
  2. ప్రధాన న్యాయమూర్తికి ఓ సివిల్స్ అభ్యర్థి లేఖ

న్యూఢిల్లీ, జూలై 29: ఢిల్లీలోని రావ్స్ కోచింగ్ సెంటర్‌లో నీరు చేరి ముగ్గురు సివిల్స్ మరణించిన దేశ రాజధానిలో మౌలిక వసతులపై తీవ్ర చర్చ నడుస్తున్నది.  ఈ నేపథ్యంలో ఓ సివిల్స్ అభ్యర్థి భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు రాసిన ఓ లేఖ వైరల్ అవుతున్నది. తాము దేశ రాజధానిలోనే ప్రత్యక్ష నరకంలో జీవిస్తున్నామని అవినాశ్ దూబే అనే విద్యార్థి సీజేఐకి లేఖ రాశారు. ముఖ్యంగా కోచింగ్ సెంటర్లు అధికంగా ఉండే రజేంద్రనగర్, ముఖర్జీ నగర్‌లో నిత్యం నరకమేనని ఆరోపించారు.

ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు. ‘భారీ వర్షాలకు బేస్‌మెంట్‌లో నీళ్లు నిండి ముగ్గురు విద్యార్థులు మరణించారు. ముఖర్జీ నగర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏండ్లుగా ఈ సమస్య అలాగే ఉండిపోయింది. నిత్యం మోకాళ్లలోతు మురికి నీళ్లలో నడిచి వెళ్తున్నాం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మాలాంటి విద్యార్థులంతా ప్రత్యక్ష నరకంలో బతుకుతున్నాం. ఆరోగ్యకరమైన వాతావరణంలో పరీక్షలకు సిద్ధమవటం మా ప్రాథమిక హక్కు.   విద్యార్థుల ఆరోగ్యాలకు డ్రైనేజీల్లో నుంచి మురికి నీరు పొంగటం తీవ్ర ప్రమాదంగా మారింది.  దయచేసి మీరు జోక్యం చేసుకొని పరిస్థితులను చక్కదిద్దేలా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీచేయండి’ అని విన్నవించాడు. 

పార్లమెంటులోనూ రగడ

కోచింగ్ సెంటర్లో వరద నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మరణించిన ఘటన పార్లమెంటును కూడా సోమవారం కుదిపేసింది. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు బలంగా లేవనెత్తాయి. లోక్‌సభలో ఈ అంశాన్ని మొదట లేవనెత్తిన బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్.. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వ వైఫల్యమే ముగ్గురు విద్యార్థుల మరణానికి కారణమని ఆరోపించారు. అందుకు ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్, కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ కౌంటర్ ఇచ్చారు. ముందు ప్రమాదానికి కారణమైన కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు ఎవరు అనుమతిచ్చారో తేల్చేందుకు దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.