22-04-2025 01:25:07 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుండగా, వాటిని పేద ప్రజలతో పాటు మన కార్యకర్తలు, నాయకులు అందుకుంటున్నారు. అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆశించిన తీరుగా పబ్లిసిటీ చేయడం లేదు.
ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానిక ఎన్నికల్లో పరాభవం పాలు కాక తప్పదని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ కార్యకర్తలు, నాయకుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. మానుకోట నియోజకవర్గ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం సందర్భంగా వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఎమ్మెల్యే పై విధంగా వ్యాఖ్యానిస్తున్నారు.
గృహాలకు ఉచితంగా నెలకు 200 యూనిట్ల విద్యుత్ పథకం, సన్నధాన్యానికి బోనస్, మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, రైతులకు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రాజీవ్ యువ వికాసంతో పాటు దేశంలో ఎక్కడ లేని విధంగా పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ, ఇతర సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుండగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు, నాయకులు ఎందుకు వెనుకబడుతున్నారని ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు.
గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేస్తే వెయ్యి రూపాయల పబ్లిసిటీ ఇచ్చుకునేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తే ఒక్క రూపాయి వంతు కూడా ‘పబ్లిసిటీ’ ఇచ్చుకోలేక పోతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
జూన్ మొదటి వారంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం తద్యమని, ఇట్లైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులు గెలుపొందడం కష్టమని, ఇప్పటికైనా కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు విస్తృత ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి 18 గంటలు కష్టపడుతున్నారు.. గ్రామాల్లో కనీసం మీరు 10 గంటలు కష్టపడలేరా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల్లో 90 శాతం సీట్లు సాధించే విధంగా కృషి చేయాలని, మీ గెలుపుకు నా వంతు పాటు పడతానని ఎమ్మెల్యే క్యాడర్ కు దిశా నిర్దేశం చేస్తున్నారు.