calender_icon.png 27 December, 2024 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టులు చేసిన ఆరోపణలపై విచారణ జరిపిస్తున్నాం..

08-11-2024 03:37:48 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): ఇటీవల మావోయిస్టు, సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి పేరిట విడుదలైన లేఖలో పేర్కొన్న ఆరోపణలపై విచారణ జరిపిస్తున్నట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పష్టం చేశారు. శుక్రవారం బెల్లంపల్లి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మావోయిస్టుల ఆరోపణలపై స్పష్టత ఇచ్చారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు భూకబ్జాలకు, రౌడీయిజానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై అధికారులతో సమాచారాన్ని సేకరిస్తున్నట్లు చెప్పారు. మావోయిస్టుల లేఖ తనను కలచి వేసిందని చెప్పారు. తన అనుచరులు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలపై తాను సీరియస్ గా వ్యవహరిస్తానన్నారు.

బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేయడానికి తాను రాజకీయాల్లో ఉన్నానే తప్పా ఏనాడు ప్రజలను ఇబ్బందులు పెట్టే పనులు చేయలేదన్నారు. తన అనుచరులు ఎక్కడైనా భూకబ్జాలకు పాల్పడినట్లు తేలితే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. ఎమ్మెల్యేగా తాను ఒక సెంటు భూమి కూడా ఎక్కడ కబ్జా చేసింది లేదన్నారు. మావోయిస్టులు చేసిన ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే వినోద్ స్పష్టం చేశారు.

ప్రజలందరితో కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఎక్కడైనా అవినీతి జరిగినట్లు తెలిస్తే ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే వినోద్ కోరారు. గతంలో మంత్రిగా ఐదేళ్లు మచ్చ లేకుండా పనిచేశానని, ఇప్పుడు కూడా అలాగే పని చేస్తానని చెప్పారు. కలెక్టర్ దీపక్ కుమార్ మాట్లాడుతూ.. ఎక్కడైనా భూ కబ్జాలు జరిగితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఆర్డిఓ హరికృష్ణ మాట్లాడుతూ.. బెల్లంపల్లి పట్టణ, మండల పరిధిలో జరిగిన భూకబ్జాలపై చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, సీనియర్ నాయకులు మునిమంద రమేష్, బావ రమేష్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.