calender_icon.png 25 October, 2024 | 4:50 AM

రాజధానిలో ట్రాఫిక్‌తో అలసిపోతున్నాం

25-10-2024 02:26:48 AM

  1. ఎంఎంటీఎస్ రైళ్ల సమయపాలనపై దృష్టి పెట్టండి
  2. మెట్రోస్థాయిలో ఎంఎంటీఎస్‌ను విస్తరించండి
  3. రైల్వే భూసేకరణలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలి
  4. కొత్త రైల్వే లైన్లు త్వరగా ప్రారంభించాలి
  5. దక్షిణ మధ్య రైల్వే జీఎంతో సమావేశంలో ఎంపీలు

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంపీలతో గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు ఏకరువు పెట్టుకున్నారు.

కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి జీ కిషన్‌రెడ్డి, 10 మంది ఎంపీలు పాల్గొన్నారు. ద.మ. రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేశ్ కుమార్ జైన్, హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేశ్ విష్ణోయ్ సీనియర్ రైల్వే అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. దక్షిణ మధ్య రైల్వే పనితీరుకు సంబంధించిన అంశాలపై జీఎం ఎంపీలకు వివరించారు. 

5 వందే భారత్ సహా 67 కొత్త రైళ్లు..

పదేండ్లలో 5 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సహా జోన్ వ్యాప్తంగా 67 కొత్త రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టిందని జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. రైలు భద్రతను పటిష్ఠం చేసే దిశగా గడిచిన పదేండ్లలో సుమారు 268 రోడ్ అండర్ బ్రిడ్జీలు, 40 రోడ్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మించినట్లు వివరించారు.

రైల్వేఅభివృద్ధి పనులు, సేవలకు సంబంధించిన అనేక సమస్యలను ఎంపీలు జీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీలు తెలిపిన డిమాండ్లలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, ఇప్పటికే ఉన్న రైళ్లకు అదనపు స్టాపేజ్‌లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు/రోడ్ అండర్ బ్రిడ్జిల నిర్మాణంతో పాటు మెరుగైన ప్రయాణికుల సౌకర్యాలపై తమ వినతి పత్రాలను అందించారు.

సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి, ఎంపీలు కేఆర్ సురేశ్ రెడ్డి, నగేశ్, ఆర్ రఘురాం రెడ్డి, బలరాం నాయక్, డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు డాక్టర్ కడియం కావ్య, బీదర్ ఎంపీ సాగర్ ఈశ్వర్ ఖండ్రే, కలబురగి ఎంపీ రాధాకృష్ణ దోడ్డమణి పాల్గొన్నారు.

ఎప్పుడు గేట్లు పడే ఉంటాయి..

 ఈటల రాజేందర్, మల్కాజిగిరి ఎంపీ

తమ నియోజకవర్గం పరిధిలో ఎటు చూసినా విస్తరించి ఉన్న రైల్వే లైన్ల పరిధిలో ఆర్‌యుబీ, ఆర్వోబీలు లేక ఎప్పుడు గేట్లు మూసే ఉంటున్నాయి. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేక ఆర్వోబీ, ఆర్‌యుబీల పనులు ముందుకు సాగడంలేదు. ఫలితంగా నగరంలో ఉద్యోగాలు చేసే వారు తమ పని ప్రదేశంలో కంటే ట్రాఫిక్‌లోనే ఎక్కువగా అలసిపోతున్నారు. బొల్లారం వద్ద ఆర్‌యుబి పని మొదలుపెట్టి 20 ఏళ్లు అయినా ఇప్పటికీ పూర్తి చేయలేదు. మెట్రో స్థాయిలో ఎంఎంటీఎస్‌ను విస్తరించాలని కోరాం.

ఏడాదికి ఒక్కసారి కాదు రెండు సార్లు..

 కేఆర్ సురేశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు

రాష్ట్రంలో రైల్వే సమస్యల పరిష్కారం కోసం ఏడాదికి ఒక్కసారి కాకుండా రెండుసార్లు సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరాం. రైల్వేశాఖ 91 శాతం రైళ్లు సమయపాలన పాటిస్తున్నాయని చెబుతున్నా స్థాని కంగా ఆ పరిస్థితి కనిపించడం లేదు. లోకల్ రైళ్ల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైల్వే ప్రాజెక్టుల భూ సేకర ణలో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వా మ్యం కల్పించాలని కోరాం. నిజామాబాద్ నుంచి నూతన రైళ్ల కోసం జీఎంకు విన్నవించాం.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు పూర్తిచేయాలి

 కడియం కావ్య, వరంగల్ ఎంపీ

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని 2025, ఏప్రిల్ నాటికి ప్రారంభిస్తామని జీఎం హామీ ఇచ్చారు. పనులు వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరాం. కోచ్ ఫ్యాక్టరీ మా కల. అది నెరవేరితే ఈ ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుంది. కాజీపేట, వరంగల్‌లో ప్లాట్‌ఫామ్‌లు పెంచాలని కోరాం.

భద్రాచలం మల్కన్‌గిరి రైల్వే పనులు త్వరగా చేపట్టాలి

 పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ ఎంపీ

భద్రాచలం రైల్వే లైన్ పనులు త్వరగా పూర్తి చేసి ఈ ప్రాంతం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరాం. నెక్కొండలో పలు రైళ్లు ఆగడం లేదు.. వాటికి స్టాపేజ్ ఏర్పాటు చేయాలని కోరాం. బలార్షా ప్యాసింజర్ రైలును తిరిగి ప్రవేశపెట్టాలని విన్నవించాం.

గద్వాల అలైన్‌మెంట్ మార్చాలి..

 రామసహాయం రఘురామిరెడ్డి, ఖమ్మం ఎంపీ

డోర్నకల్ నుంచి గద్వాల వరకు నిర్మించనున్న కొత్త రైల్వే లైన్‌కు మార్చా లని కోరాం. అలైన్‌మెంట్ మార్పు వల్ల భూసేకరణ సమస్యలు తీరడంతోపాటు కొత్తగా పలు ప్రాంతాలకు సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. కరోనా సమయంలో ఆపేసిన రైళ్లను తిరిగి ప్రవేశపెట్టాలని విన్నవించాం.

నాగులపల్లిని టెర్మినల్ చేయండి..

ఎం రఘునందన్‌రావు, మెదక్ ఎంపీ

నగరంలో ఉన్న ప్రధాన రైల్వే టెర్మినల్స్‌లో రైళ్ల రాకపోకలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఓఆర్‌ఆర్ పక్కనే ఉన్న నాగులపల్లిని రైల్వే టెర్మినల్‌గా అభివృద్ధి చేయాలని రైల్వే అధికారుల దృష్టికి తీసుకుపోయినట్లు మెదక్ ఎంపీ రఘునందన్ తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ వెంట రీజినల్ రైల్వే లైన్ వేయాలని కోరారు.

ఇందుకు భూసేకరణ చేపట్టాలన్నారు. జర్నలిస్టులకు, దివ్యాంగులకు సంబంధించిన రైల్వే పాస్‌లను పునరుద్ధరించాలని కోరారు. మనోహరాబాద్ సిద్ధిపేట కొత్తపల్లి రైల్వే లైన్ పనులను త్వరగా పూర్తి చేసి రైళ్లను నడిపించాలని కోరినట్లు తెలిపారు. మెదక్ నుంచి తిరుపతికి కొత్తగా రైళ్లను ప్రారంభించాలని కోరామన్నారు. 

కొత్తలైన్ల కోసం విజ్ఞప్తి చేశాం..

డీకే అరుణ, మహబూబ్ నగర్ ఎంపీ

మహబూబ్ నగర్-తాండూ రు, జడ్చర్ల-మిర్యాలగూడ, జడ్చర్ల-నంద్యాల కొత్త రైల్వే లైన్ల ఏర్పా టుతో మహబూబ్‌నగర్ ప్రాంత అభివృద్ధికి అవకాశం ఉంటుంది. అందుకే ఈలైన్లను ఏర్పాటు చేయాలని రైల్వే జీఎంకు విన్నవించాం. ప్రతిపాదిత కృషాెే్ణవికారాబాద్ రైల్వే లైన్ పనులను త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశాం.

ప్రస్తుతం ఉందా నగర్ వరకు నడుస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లను షాద్‌నగర్ వరకు విస్తరించాలని కోరాం. మహబూబ్ నగర్ గూడ్స్ షెడ్‌ను తొలగించే ప్రతిపాదనను విరమించుకోవాలని, కర్నూలు- సికింద్రా బాద్ మ ధ్య నడిచే హంద్రీ రైలును మలక్‌పేటలో ఆపాలని కోరాం.